- ఆ ఘటనను తల్చుకుంటే క్రికెటర్లు ఇప్పటికీ వణికిపోతారు..
Dark Day in Cricket History : పాకిస్తాన్ లో ఉగ్రవాద రక్కసి ఎంత వేళ్లూనుకుపోయిందో ప్రపంచమంతటికీ తెలుసు. ఉగ్రవాదాన్ని ఒకప్పటి పాలకులు పెంచిపోషించారు. దీంతో ఆ ఉగ్రవాదమే నేడు పాకిస్తాన్ ను శాసిస్తోంది. పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే ఇతర దేశస్తులు భయపడే పరిస్థితి.
క్రికెట్ ఆటలో పాకిస్తాన్ బలమైన జట్టే. కానీ ఆ జట్టుతో పాకిస్తాన్ లో ఆడాలంటే మిగతా జట్లు భయపడిపోయేవి. దీనికి కారణం 2009 మార్చి 3న శ్రీలంక జట్టుపై జరిగిన దాడి. పెద్ద కాన్వాయ్ లో భాగంగా శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాకిస్తాన్ లోని లాహోర్ లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది ముష్కరులు కాల్పలు జరిపారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో మూడో రోజు ఆడేందుకు క్రికెటర్లు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీలంక క్రికెట్ జట్టులోని 6గురు సభ్యులు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్ లోని పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు.
ఈ దాడికి లష్కరే జాంగ్వీ పాల్పడినట్టు అక్కడి భద్రతా సిబ్బంది భావించారు. 2016 ఆగస్టులో లాహోర్ లో పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే అక్టోబర్ ప్రధాన సూత్రధారిని చంపివేశారు. తమ జట్టుపై ముష్కరులు దాడి చేయడాన్ని ఇప్పటికీ శ్రీలంక క్రికెటర్లు తలుచుకుని వణికిపోతుంటారు. క్షణకాలంలో తమ ప్రాణాలు పోయేవని, ఆ భయానక పరిస్థితి ఎవ్వరికీ రావొద్దని కోరుకుంటున్నారు.
కాగా, దాడి అనంతరం శ్రీలంక జట్టును తర్వాత స్టేడియానికి తీసుకెళ్లారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మిల్ మి-17 హెలికాప్టర్ల ద్వారా పిచ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి కొలంబోకు తరలించారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ కు క్రికెట్ రంగంలో గట్టి ఎదురుదెబ్బ తాకిందనే చెప్పాలి. పాకిస్తాన్ లో ఆడాలంటే ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలై ఆ ప్రభావం క్రికెట్ పై కూడా పడింది.