
డైరెక్షన్ : అశ్విన్ రామ్
నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి
సినిమాటోగ్రఫి: నరేష్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
సంగీతం: వివేక్ సాగర్
మాటలు: హేమంత్
పాటలు: కాసర్ల శ్యామ్
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల: 19-07-2024
Darling Movie : ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ డార్లింగ్. అదే టైటిల్ తో టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా శుక్రవారం విడుదలైంది. నభానటేష్ హీరోయిన్ గా నటించింది. డార్లింగ్ సినిమా టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అశ్విన్ రామ్ డైరెక్షన్ ఈ సినిమా రూపొందింది. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంతో పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా తెలుసుకుందాం.
రాఘవ (ప్రియదర్శి) ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పనిచేస్తుంటాడు. మంచి ఉద్యోగం సంపాదించి.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్దకు వెళ్లాలనేది అతని కోరిక. అనుకున్నట్లుగానే మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు. నందిని (అనన్య నాగళ్ల)తో పెళ్లిపీటల మీద వివాహం ఆగిపోవడంతో ఆత్మ హత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఆనంది (నభా నటేష్) అతని ఆత్మహత్య ప్రయత్నం ఆలోచనను మార్చి వేస్తుంది. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడిన రాఘవ ఆనందిని పెళ్లి చేసుకొంటాడు.
నందినితో రాఘవ పెళ్లి ఎందుకు ఆగిపోయింది. ? రాఘవ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాడు? అసలు పరిచయమే లేని ఆనందినిని అతను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు? ఆనందిని నుంచి రాఘవకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆనందికి ఉన్న జబ్బు ఏంటి? దాని వల్ల రాఘవకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? ఆనంది మానసిక సమస్యను దూరం చేసి ఆమె ప్రేమను ఎలా గెలిచాడు? పారిస్‌కు వెళ్లాలనే తన కోరికను ఎలా తీర్చుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే డార్లింగ్ సినిమా.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అపరిచితుడు లాంటి ఇంటెన్స్ ఉన్న కథ. దర్శకుడు పరుశురామ్ ఆలోచన, ఎంచుకున్న అంశం బాగుంది. కానీ తన విజన్‌ను తెరపై పూర్తి స్థాయిలో చూపించడంలో కొంత తడబాటుకు గురయ్యాడు. స్క్రిప్టు పరంగా కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని నభా నటేష్, ప్రియదర్శి తమ పెర్ఫార్మెన్స్‌తో కనపించకుండా చేశారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు..
నరేష్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. మూవీని అందంగా, ప్రతి ఫ్రేమ్ ను చాలా రిచ్‌గా చూపించారు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే పాటలు మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు. కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు సినిమా నిర్మాణానికి బాగానే ఖర్చు పెట్టారు. హనుమాన్ తరహాలోనే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ మంచి నిర్మాణ విలువలతో సినిమాను అందించారు.
డిఫరెంట్ కాన్సెప్ట్..
డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్‌తో సినిమాను తెరకెక్కించారు. నభా నటేష్, ప్రియదర్శి తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమా నిడివి ఎక్కువైంది, కొన్ని సీన్లు ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తాయి. అక్కడక్కగా సినిమా సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది. ఫ్రెష్, డిఫరెంట్ ప్రేమకథ, సైకాలజికల్ థ్రిల్లర్ ను ఆస్వాదించాలనుకుంటే డార్లింగ్ సినిమాను చూసేయొచ్చు.
కాస్టింగ్: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, మురళీధర్ గౌడ్, అనన్య నాగళ్ల, రఘుబాబు, సంజయ్ స్వరూప్ తదితరులు
రేటింగ్ : 2/5