
Srikanth Odela wedding : దసరా (Dasara) సినిమాతో ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ యంగ్ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కి చెందిన ఈ యంగ్ డైరెక్టర్ తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఒక్క సినిమాతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సెంటినరీ కాలనీ కి చెందిన సౌమ్యారెడ్డితో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీకాంత్ ఓదెల వివాహం జరిగింది.
వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకుడు సుకుమార్, హీరో నాని భార్య, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకట రమణారెడ్డి, ఎం శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. పుణెలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో ఉన్న హీరో నాని వెడ్డింగ్ ఈవెంట్‌కు రాలేకపోయాడు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాంత్ ఓదెలకు శుభాకాంక్షలు తెలియజేశాడు నాని.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో సింగరేణి బ్యాక్ డ్రాప్‌లోని వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ నేపథ్యంలో తెరకెక్కించిన దసరా సినిమా నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో నాని తొలిసారి వంద కోట్ల క్లబ్ చేరాడు. ఈ సినిమా సక్సెస్‌తో అగ్ర దర్శకనిర్మాతలు, చిత్రనిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించాడు శ్రీకాంత్ ఓదెల. అయితే తన తదుపరి సినిమా అక్కినేని అఖిల్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చినా ఈ డైరెక్టర్ దీనిపై స్పందించలేదు. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ తో చర్చలు కొనసాగిస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.






