
Dashabdi Ustavalu : మరో ఆరు నెలల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. కానీ అమలు చేయడంలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా నాయకులు వ్యవహరించడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లోకల్ లీడర్లు బలపడేందుకు కేసీఆర్ వేసిన భారీ స్కెచ్ ను వినియోగించుకోలేకపోయారంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానిక పార్టీగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పుట్టింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. రాజకీయ పార్టీలు దాన ధర్మాలు చేయదని, రాజకీయాలే చేస్తుందని బాహాటంగానే కేసీఆర్ ప్రకటించారు కూడా. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే కేసీఆర్ తెలంగాణ పేరును తొలగించి ఆ ప్లేస్ లో భారత్ పేరును చేర్చి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. దీనికి కావలసిన ఫండ్ సేకరించడంలో సక్సెస్ అయ్యారు నేతలు. ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. దశాబ్ది ఉత్సవాలకు అంటూ కోట్లాది రూపాయలను విడుదల చేశారు. ఇందులో భాగంగా నాయకులు, పార్టీ కార్యకర్తలు రోజుకో శాఖలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ శాఖ ఎలా డెవలప్ అయ్యిందో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇక్కడ ‘సొమ్మొకడిది సోకకడిది’ అన్న నానుడిని అక్షర సత్యం చేశారు కేసీఆర్. వేడుకలు అంటూ కోట్లాది రూపాయలను విడుదల చేశారు. కానీ ప్రొగ్రామ్స్ పెట్టి పార్టీ ప్రచారం కూడా చేసుకోవాలనుకున్నారు. 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో రోజుకో శాఖ, ఆయా విభాగాల పనితీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కింది స్థాయి నేతలు, కేడర్ అందరూ పార్టీ ప్రచారం చేయాలని లోలోన చెప్పినట్లుగా తెలుస్తోంది.
నాయకులు పట్టించుకోకపోవడం, ప్రజల అసంతృప్తితో ఉత్సవాలు ఫెయిల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక కేడర్ లో గొడవలు వస్తుంటే.. మరికొన్ని చోట్ల డబ్బులు సరిపోవడం లేదని బాహాటంగానే వినిపిస్తుంది. ఈ విషయాలను కూడా అధినేత విన్నారు. సరిపోకుంటే మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఉత్సవాల్లో పాల్గొనడం లేదు.. నిరసనలు చేపట్టే వారెవరు..? ఇలా ప్రతీ అంశంపై ఆరా తీస్తున్నారు. అందరి జాబితా తయారు చేసి టికెట్ల ఇచ్చేప్పుడు చూసుకుంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా కేసీఆర్ స్కెచ్ మాత్రం ఈ సారి కలిసిరాలేదనే చెప్పాలి.






