Devara : వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దేవరకు ఫస్ట్ వీకెండ్ పూర్తయింది. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తొలి ఆదివారం పూర్తయిన తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఏ మేరకు ఉన్నాయన్న దానిపై అందరిలో ఉత్సుకత ఉంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 190 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ లో రూ. 60 కోట్లు దక్కించుకుంది. దీంతో ఆదివారం రాత్రి వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 250 కోట్లకు చేరింది. అయితే దేవర సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ‘రూ. 304 కోట్ల’ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
అయితే, అందుబాటులో ఉన్న అన్ని రికార్డుల ప్రకారం.. వాస్తవ కలెక్షన్లు పైన చెప్పినట్లుగా రూ. 250 కోట్ల గ్రాస్ గా ఉన్నాయి, దీన్ని బట్టి మేకర్స్ అదనంగా మరో రూ. 50 కోట్లు సాధించినట్లు చెప్పి పోస్టర్ విడుదల చేశారని తెలుస్తోంది. ఇప్పుడు వీక్ డేస్ మొదలవడంతో అదే స్థాయిలో కలెక్షన్ల జోరు కొనసాగించడం ఈ సినిమాకు అంత సులువు కాదు.
అయితే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సెలవు, రానున్న దసరా సీజన్ కావడంతో విద్యార్థులకు కూడా సెలవులు వస్తాయి. వీటన్నింటి నేపథ్యంలో కలెక్షన్ల మరింత వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రం థియేటర్లలో తన ఆకట్టుకునే బాక్సాఫీస్ ఊపును ఇంకెంత కాలం కొనసాగిస్తుందో చూడాలి.