
Cow surrogacy : దేశీయ ఆవులు అంతరిస్తున్నాయి. దీంతో మనకు పాల ఉత్పత్తులు తగ్గుతున్నాయి. పాల దిగుబడిలో అభివృద్ధి సాధించాలంటే ఆవుల ఉత్పత్తి ఒక్కటే మార్గం. ప్రస్తుత కాలంలో దేశీయ ఆవుల సంతతి కనిపించడం లేదు. ఎవరు చూసినా జెర్సీ ఆవులనే పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ సంతతి క్రమంగా అంతరిస్తోంది. దేశీయ ఆవులను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పించింది.
సరోగసి విధానం ద్వారా ఆవులను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే గిర్ ఆవు పిండం ఒంగోలు జాతి ఆవులో ప్రవేశపెట్టడం జరిగింది. అది దూడకు జన్మనిచ్చింది. ఇదే విధానం ద్వారా దేశీయ ఆవులను ఉత్పత్తి చేసి వాటి కొరతను తీరుస్తామని టీటీడీ చెబుతోంది. దీనికి గాను పక్కా ప్రణాళిక అమలు చేయనున్నారు. అంతరించిపోతున్న దేశీయ ఆవుల సంతతిని పెంచుతున్నట్లు చెబుతున్నారు.
దీనికి గాను రూ. 3.8 కోట్లు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి అందజేసింది. దీంతో సరోగసి విధానంలో నూతన ఆవుల సృష్టికి కంకణం కట్టుకున్నారు. ఈ ఏడాది 94 ఆవులకు సరోగసి ద్వారా సంతానం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశీయ ఆవుల ఉత్పత్తిలో ఈ విధానం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు.
ఒంగోలు జాతి ఆవులతో రోజుకు 60 కిలోల నెయ్యి తీయాలని టీటీడీ భావిస్తోంది. 40 కిలోల పాలకు ఒక కిలో నెయ్యి వస్తుంది. 2500 లీటర్ల పాలు కావాలంటే 500 దేశీయ ఆవులు అవసరమవుతాయి. రామమయం ట్రస్టు వాళ్లు 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవుల్ని వితరణ చేశారు. వచ్చే ఐదేళ్లలో టీటీడీ గోశాలలో వెయ్యి ఆవుల్ని సిద్ధంగా ఉంచేందుకు సిద్ధమైంది.