YCP : ఏపీలోని వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో పోటీ చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తవారికి అవకాశం ఇవ్వడం ముఖ్యంగా ఈ అసంతృప్తికి కారణమవుతున్నది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు అక్కడ వారికే సీట్లు కేటాయిస్తామని జగన్ చెప్పడంతో, వైసీపీలో అసంతృప్తి రగిలింది. ఎన్నికలకు ముందు ఇది వైసీపీ పుట్టిని ముంచేలా కనిపిస్తున్నది.
ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పుడు గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి పార్టీ ప్రాధాన్యమిస్తుండడంతో, అక్కడ వైసీపీ తరఫున గతంలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నారు. ఆయన టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైందనే ప్రచారం జరిగింది. ఇక చీరాలలోనూ అదే పరిస్థితి నెలకొంది. చీరాలలో కరుణ బలరాం వైసీపీలో చేరడంతో అక్కడ ఆమంచి పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టీడీపీ నుంచి చేరిన మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే టీడీపీ నుంచి చేరిన వారే పార్టీలో బాగుపడ్డారని, ఆది నుంచి కష్టపడిన వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.
పక్క పార్టీల నుంచి చేరిన వారికే జగన్ సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం వీరి అసంతృప్తికి కారణమవుతున్నది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇలాంటి అసంతృప్త జ్వాలలు తోడైతే ఇక వైసీపీకి ప్రతికూలత తప్పదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది. ఏదేమైనా ఎన్నికల సమయంలో ఇలాంటి ఎదురు గాలి మరెన్ని నియోజకవర్గాలకు పాకుతుందోనని అగ్రనేతల్లో ఆందోళన మొదలైంది. ఇది మరింత తీవ్రమైతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.