High Court Order : భారత రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని దాఖలైన పిటీషిన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా ఆఫీస్ కట్టారని, 15 రోజుల్లో కూల్చివేయాలని హై కోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎకరం స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మించింది. ఎన్నికలకు ముందే కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నా ఆ సమయంలో వీలు కాలేదు. అయితే నల్గొండ టౌన్ లో కట్టిన ఈ భవనానికి మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ ఆఫీసును రెగ్యూలరైజ్ చేసేలా అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడం, పైగా ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రాంతంలో ఆఫీసు ఉందని కూల్చివేయక తప్పదని మున్సిపల్ శాఖ వాదనలు వినిపించింది. దీంతో హైకోర్టు కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది.
15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. వరంగల్ జిల్లా పార్టీ ఆఫీస్ విషయంలోనూ ఈ వివాదమే కొనసాగుతోంది. అది కూడా అక్రమ నిర్మాణమని, దానికి కూడా అనుమతులు లేకుండా నిర్మించారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. నల్గొండ పార్టీ ఆఫీస్ తీర్పునే వరంగల్ పార్టీ ఆఫీసుకు వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ నేతలు కోర్టును అభ్యర్థించే అవకాశాలు లేకపోలేదు.