Dont mistake : సనాతన ధర్మంలో పితురులను (పూర్వీకులకు) స్మరించుకునేందుకు పక్షం రోజులను కేటాయించింది. ఇంట్లో ఏ కార్యం చేసుకున్నా.. మొదట పూర్వీకులను స్మరించుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే వీరిని కార్యంలో కాకుండా ఏకంగా పక్షం (15 రోజులు) దినాలు స్మరించుకుంటారు దాన్నే ‘పితృపక్షం’ అంటారు. ఈ పక్షం రోజుల్లో వారు వారి వారసులు పెట్టిన ఆహారం స్వీకరిస్తారు.
ఈ పితృపక్షంలో పూర్వీకులు వారి వారసుల కోసం భూమిపైకి వస్తారనేది శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ సమయంలో నిష్టగా ఉండాలి. ఈ సమయంలో కొన్ని రకాల తప్పులు చేస్తే పితృ దోషం అంటుకుంటుందట. మరి ఈ సమయంలో చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
మగవారు చేయకూడని పనులు..
పితృపక్షంలో స్నానం, దానం, తర్పణం, తదితర పనులు చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. మగవారు మరీ ముఖ్యంగా ఈ పనులు చేస్తే పితృ దోషం అంటుకుంటుంది. ఒకవేళ తెలియక చేసినా పితురుల ఆగ్రహానికి గురవక తప్పదు. ఈ పితృపక్షంలో శుభకార్యాలు మంచిది కాదు. పురుషులు కొత్త వస్తువులు లేదంటే కొత్త బట్టలు కొనద్దు. ఈ సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి.
పొరపాటున జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం చేయరాదు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని శాస్త్రం చెప్తోంది. పితృపక్షంలో కర్మ పెట్టేందుకు తయారు చేసే వంట పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనుప పాత్రలు వద్దు. రాగి ఇత్తడి పాత్రాలను మాత్రమే వినియోగించాలి. పితృపక్షంలో ఆహారంలో ఉల్లి, వెళ్లుల్లి చేర్చడం మంచిది కాదు.
గృహ ప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభం వంటి పనులు చేయడం మంచిది కాదు. ఎలాంటి శుభకార్యాలు జరగకుండా చూడాలి. పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే దోషానికి గురవుతారు. దీంతో కుటుంబానికి ఆర్థిక నష్టం, కష్టాలు పెరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పితృపక్షంలో ఈ పనులు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.