‘Gruha Lakshmi’ scheme :
తెలంగాణ ప్రభుత్వం పేద వారి కోసం ‘గృహ లక్ష్మి’ పథకాన్ని తెచ్చింది. ఈ పథకంతో పేదవాడిని ఆర్థికంగా ఆదుకోనుంది. పేదల సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఈ పథకం ఎంతో దోహదం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వేడి నీటికి తోడు చన్నీరు చందంగా రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి కాకున్నా ఎంతో కొంత ఆర్థిక భారం మాత్రం తగ్గుతుంది. పైగా ఈ పథకంతో ఎక్కువ మంది పేదలు ముందుకు వస్తారు. దీంతో సొంతింటి కల నెరవేరుతుంది.
ప్రభుత్వం అందించే రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని కొట్టి పారయలేం. ఎందుకంటే ఇంటి నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. అందుకే వెనుకటికి ఒక సామెత ఉంది. ‘ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ ఇళ్లయినా పెళ్లి అయినా బాగా ఖర్చుతో కూడుకున్నవే. నిర్మాణం కోసం అప్పులు చేస్తే వడ్డీల భారం తడిసి మోపడవుతుంది. ఇక బ్యాంక్ లోన్ పెట్టి తీసుకోవాలంటే ఇళ్లు పూర్తి కాకముందే ఈఎంఐల భారం పడుతుంది. వీటన్నింటిని పరిశీలిస్తే ఇది ఎంతో కొంత బెటరేకదా..
పథకం మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. మొదట ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కు 3వేల ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4లక్షల ఇళ్లకు రూ. 7350 కోట్లు ఖర్చు కేటాయించానున్నారు. ఇక రిజర్వేషన్ పరంగాచూస్తే ప్రతీ సెగ్మెంట్ లో 20 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీ, 50 శాతం బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇల్లు మహిళ పేరుమీదనే మంజూరవుతుంది. ఆమె పేరుపైనే బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇందుకు జన్ ధన్ ఖాతాను ఉపయోగించవద్దు. ఇక, నిర్మాణదారు వారి ఇష్టానికి అనుగుణంగా నిర్మించుకోవచ్చు. కానీ, ఇంటిమీద మాత్రం ‘గృహ లక్ష్మి’ లోగో మాత్రం ఉండాల్సిందే.
కుటుంబం వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. వారి పేరుమీద ఎలాంటి ఇల్లు ఉండకూడదు. ఇక నగదును మూడు విడుతల్లో రిలీజ్ చేస్తారు. బేస్మెంట్ లెవల్ లో ఒక విడుత, రూఫ్ లెవల్ లో మరో విడుదత, స్లాబు లెవల్ లో చివరి విడుతను బ్యాంక్ ఖాతాలో వేస్తారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా దరఖాస్తులను కలెక్టర్ స్వీకరిస్తారు. పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా ఆర్థిక సాయం అందుతుంది. మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ‘గృహ లక్ష్మి’ పథకం కోసం ప్రత్యేక వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.