Red Tamarind Tree : తీవ్ర కరువు, తుపానుల వంటి తీవ్ర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతుకు ఏటా మంచి ఆదాయాన్ని అందజేస్తున్న మంచి ఉద్యానవన పంట ‘ఎర్ర చింత’. దీని అసలు పేరు ‘అనంత రుధిర’. ఇది సహజమైన రకం. అనంతపురం ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదలైంది. ఈ చింతపండు ఎరుపు రంగులో ఉండటం.. సాధారణ చింతపండు కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. బత్తాయి తదితర పండ్ల తోటలు ఎండిపోతున్నా.. తీవ్ర వర్షాభావ పరిస్థితులను, గాలులతో కూడిన వానలను తట్టుకోగలుగుతుంది. చింతపండుతో దక్షిణాది రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది.
కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింతను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చింతపండును ఇంట్లో రోజూ వంటల్లో వాడుకోవడానికి, నిల్వ ఉండే పచ్చళ్లలో ఉపయోగిస్తున్నాం. చింతపండు అంటే నల్లగా ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే తాజాగా ఓ రకమైన ఎర్రటి చింతపండు వెలుగులోకి వచ్చింది. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది. దీనికి ‘ఛాంపియన్ ట్రీ’ అని పేరు పెట్టి ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల ద్వారా అంట్లను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తున్నారు. ఈ ఏడాది కనీసం 20 వేల అంట్లు ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు.
ఈ చెట్టుకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే దాని వయసు… వంద ఏళ్లుపైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన ఎర్ర చింతకాయ చెట్టు తెలంగాణ రాష్ట్రంలోని చేర్యాలలో ఉంది. చెట్టుకు కాసే చింతకాయలుపైన మామూలుగానే ఉన్నా లోపల మాత్రం ఎర్రగా ఉంటుంది. రుచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. ఈ చెట్టు వానగాయలను గిచ్చితే గోళ్లకు, వేళ్లకు ఎర్ర రంగు అంటుకుంటుంది. తింటే నోరంతా ఎర్రగా మారుతుంది. ఈ దగ్గరలో గవర్నమెంట్ జూనియర్, డిగ్రీ కాలేజ్ లు, గవర్నమెంట్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో చదువుకునే విద్యార్థులు ఈ చెట్టుకు కాసే చింతకాయలను తెంపి తింటూ… సరదాగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆడుకుంటుంటారు.
క్లాసులు ఎగ్గొట్టే విద్యార్థులకు ఈ ఎర్ర చింతచెట్టే అడ్డా. అయితే వందేళ్ల వయసున్న ఈ అరుదైన చెట్టును కాపాడాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్ ఉన్నట్లు తేలింది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు.ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎగుమతుల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది.
ఈ ఎర్ర చింత చెట్లు, గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి.. కాబట్టి ఎటు చూసినా ఎనిమిది మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత ఐదో సంవత్సరం నుంచి కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20ఏళ్ల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండు దిగుబడి వస్తుంది.