AP Political Parties : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జాతకం మారబోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు 175 సీట్లు తమవే అని ప్రగల్బాలు పలికినా అదంత సులభం కాదని తేలిపోతోంది. వైసీపీ విధానాలే ఆ పార్టీకి గుదిబండలా మారాయి. జగన్ లో రాక్షసత్వం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిపాలనలో నియంతగా మారడంతోనే వచ్చే ఎన్నికల్లో కీలెరిగి వాత పెడతారని అంటున్నారు.
దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే, సీ ఓటర్ తో కలిపి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ నాలుగు ప్రధాన పార్టీలు ఉండటంతో ఏ పార్టీకి విజయం దక్కుతుందనే విషయం వివరంగా తెలియజేశాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉండనుంది.
ఇండియా టుడే, సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లలో టీడీపీ జనసేన కూటమికి 17 వస్తాయని అంచనా వేస్తోంది. వైసీపీకి మాత్రం 8 సీట్లే వస్తాయని చెబుతోంది. దీంతో మూడు పార్టీల్లో సీట్లు దక్కించుకుంటాయని వెల్లడించింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి సీట్లు వచ్చే అవకాశాలు తక్కువేనని చెబుతోంది.
టీడీపీ జనసేన కూటమికి లోక్ సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని సూచించింది. కాంగ్రెస్ కు 2.7 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం ఓట్లు మాత్రమే సాధించనున్నట్లు చెబుతోంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ జనసేన కూటమికి 119 సీట్లు, వైసీపీకి 56 సీట్లు వస్తాయని లెక్కలు చెబుతున్నాయి.