
Janasena ఏపీలో జనసేన దూసుకొస్తున్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయిలో అధికార వైసీపీపై పోరాడుతున్నది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ దూసుకెళ్తున్నది. ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నిస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నది. అయితే 2024 ఎన్నికల్లో జనసేన రెండే లక్ష్యాలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నది. అందులో ఒకటి అధికార వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం. రెండోది అధికార పీఠం కైవసం చేసుకునేందుకు తన దైన శైలిలో అడుగులు వేయడం.
అయితే 2024లో అధికారం అందుకునేందుకు ఇప్పటికైతే జనసేనకు అవకాశం లేదు. ప్రజల్లో ఆ స్థాయిలో మద్దతు కూడా లేదు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన వైసీపీని గద్దె దింపాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ర్టంలో సీనియర్ నేతగా చంద్రబాబుకే ఈ సారి అవకాశం ఇచ్చేందుకు జనసేనాని మొగ్గు చూపుతారు. ఎందుకంటే 2029 ఎన్నికల్లో ఎన్నికల వరకు చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం సహకరించే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో అప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నేతగా పవన్ కళ్యాణ్ మాత్రమే తెరపైకి వస్తారు. దీనిలో భాగంగా ఆయన పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆలోగా టీడీపీ మద్దతుదారుల దృష్టి కూడా తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.ఇందులో భాగంగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆది నుంచి కూడా ఆయన జగన్ ప్రభుత్వం పై తనదైన స్థాయిలో పోరాడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఈసారి జగన్ ను ఓడించి తమ మద్దతుతో టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నారు.
అసెంబ్లీలో ప్రజల తరఫున తన వాక్కును వినిపించి ఆ తర్వాత 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం పైకి ఎక్కాలని జనసేనాని భావిస్తున్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో అవకాశం ఇచ్చి తదనంతరం టీడీపీ శ్రేణుల మద్దతును కూడా తనవైపు తిప్పుకునేలా అయినా వ్యూహాలు రచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా తనలో రాజకీయ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకొని, తద్వారా ప్రజా సమస్యలపై పోరాడి, 2029 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం గద్దెనెక్కెలా ఆయన పావులు కదుపుతున్నారు. ఏదేమైనా అన్న చిరంజీవిలా కాకుండా పవన్ కళ్యాణ్ కొంత దూకుడుగా వెళ్తున్నారు. పార్టీలో చెప్పుకోవడానికి పెద్దగా నాయకులు లేకున్నా, కింది వర్గాల నుంచే నాయకులను తయారు చేస్తామని ప్రకటిస్తున్నారు.






