Idli భారత్ లో ప్రధానంగా దక్షిణ భారతంలో టిఫిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే వంటకం ఇడ్లీ. దోశ, ఉప్మా, బజ్జీ, పూరీ ఇలా ఎన్ని ఉన్నా.. ఇడ్లీ ప్రత్యేకతే వేరు. పిల్లల నుంచి వృద్ధుల వరకు రోగుల నుంచి ఆరోగ్య వంతుల వరకు. ఆస్తికుల నుంచి నాస్తికుల వరకు ఈ వంటకాన్ని ఆరగించవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. ఉప్మాతో పోల్చుకుంటే దీనికే అరుగుదల ఎక్కువ. ఇక జ్వరం, అనారోగ్యం కలిగిన వారికి ఇది అమృతంగా పని చేస్తుంది. అసలు ఇడ్లీ చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇండోనేషియా నుంచి..
ఇండియాలో ఇంత డిమాండ్ లో ఉన్న ఆహారం మరోటి లేదంటే సందేహం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇడ్లీ ఇండియా వంటకం కాదని (భారతదేశంలో పుట్టలేదని) చరిత్రకారులు చెప్తున్నారు. ఇడ్లీ అంటే దక్షిణాది వంటకం అని అందరూ భావిస్తారు. ఫుడ్ హిస్టరియన్ కేటీ ఆచార్య మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని చెప్పాడు.
ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను ఎక్కువగా ఇష్టపడేవారట. అందులో భాగంగానే పుట్టింది ఇడ్లీ. 800 నుంచి 1200 సంవత్సరంలో ఇండియాకు వచ్చింది ఈ వంటకం. ఇక ఇండియాలో తొలిసారి ఇడ్లీలను తయారు చేసింది మాత్రం కర్ణాటకలోనే అని ఆచార్య చెప్పారు. వాటిని మాత్రం ఇడ్లీలు అని కాకుండా ‘ఇడ్డలిగే’ అని పిలిచేవారట. దీనికి సంస్కృత పదం ‘ఇడ్డరికా’.
అరబ్ షేక్ ల ‘రైస్ బాల్స్’
ఇడ్లీలపై ఇంకో వాదన కూడా ఉంది. కైరోలోని అల్ అజహర్ యూనివర్సిటీ లైబ్రరీ థియరీ ప్రకారం.. దక్షిణ భూ భాగానికి చెందిన అరబ్ వ్యాపారులు ఇడ్లీని ఇండియాకు పరిచయం చేశారని ఉంది. అరబ్ లు దక్షిణాది వారిని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడం వల్ల ఇడ్లీ దక్షిణాది వంటకంగా మారిందని చెప్పింది. ముస్లిం వంటకాలైన హలీమ్‌లో ప్రత్యేకంగా కనిపించేందుకు రైస్ బాల్స్ (ఉడికించిన బియ్యం ఉండలు) వేసేవారట. కాల క్రమేనా వాటిని ఇప్పుడున్న ఇడ్లీలుగా మలచి కొబ్బరి చెక్నీతో తినడం అలవాటు చేసుకున్నారట.
8వ శతాబ్దం నుంచి రైస్ బాల్స్.. ఇడ్లీ పేరుతో ప్రచారంలోకి వచ్చి దేశమంతా వ్యాపించాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ పుట్టినా ఇడ్లీ ఇండియాదేనని ప్రపంచం మాత్రం బలంగా నమ్ముతోంది. ఇడ్లీ ఇండియన్ ఫుడ్‌గా గుర్తింపు దక్కించుకుంది.