Sundar Pichai : దేశంలోని చెన్నైలో పుట్టి.. అమెరికాలో గూగుల్ సీఈవో వరకు ప్రస్థానం సాగించిన సుందర్ పిచాయ్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో దేశాల అధ్యక్షుల కన్నా పవర్ ఫుల్ పదవి అయినా గూగుల్ సీఈవోగా ఎదగడం నిజంగా ఆయనకే కాదు మన దేశానికి కూడా గర్వకారణమే. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థను నడిపించేది భారతీయుడే అని చెప్పుకుంటే కూడా ఎంతో గర్వంగా ఉంటుందనే చెప్పాలి.
అంతటి సాంకేతిక మేధావి దినచర్యపై అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. సుందర్ పిచాయ్ తన రోజును చదవడంతో ప్రారంభిస్తారని మీకు తెలుసా? ప్రపంచంలోనే టెక్ సంస్థకు నాయకుడైన సుందర్ కు ఈ అలవాటు ఉండడం మనకు సాధారణ విషయంగానే తోచవచ్చు. అయితే పొద్దున లేవగానే ఆయన ఏ వార్తాపత్రికనో, పుస్తకమో చదువుతారని అనుకుంటాం. కానీ టెక్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అప్ డేట్లు తెలుసుకుంటారట.
వైర్డ్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ సుందర్ ఈ విషయాలను పంచుకున్నారు. ఇప్పటికీ ‘వెబ్’ అంటే తనకు అమితాసక్తి అని వెల్లడించాు. పొద్దున లేవగానే ‘టెక్ మీమ్’ అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తానని చెప్పారు. దీంట్లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న లేటెస్ట్ సమాచారాన్ని హెడ్ లైన్ల రూపంలో ఒక దగ్గరకు చేర్చి అందుబాటులో చేర్చుతారు. దీన్ని ఫాలో అవుతుంటానని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సెరీ గతంలోనే వెల్లడించారు.
టెక్ దిగ్గజాలు అందరూ చూసే ‘టెక్ మీమ్’ వెబ్ సైట్ ను 2005లో గేబ్ రివేరా స్థాపించారు. ఇది టెక్ ప్రపంచంలోని అప్ డేట్ల సారాంశాలు, అసలు కథనాల లింక్స్ ను సేకరిస్తుంది. ఆయా సమాచారానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని ఒక వరుస క్రమంలో ఉంచుతుంది. పైగా సందర్భం, పరిశ్రమలో దాని వినియోగంతో కూడిన వివరాలనూ అందిస్తుంది. ఇలా పరిశ్రమలో చోటుచేసుకుంటున్న డెవలప్ మెంట్స్ ను సమగ్రంగా మన ముందు ఉంచుతుంది. టెక్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక ప్రాధాన్య వెబ్ సైట్ అని చెప్పవచ్చు.