Mental agony : ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతోనే బాయ్‌ఫ్రెండ్‌తో తెగతెంపులు, భర్తకు విడాకులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లో మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. ఈ బాధను మనసులో దాచుకోలేక, ఎవరితోనూ పైకి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తుంటారు. అలాగని ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే.. దాని ప్రభావం మన ఆరోగ్యం పైనే కాదు ఇతర బంధాల పై కూడా పడుతుందని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. అందుకే ఈ మనోవేదన నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మన ఆలోచనల్లో, చేతల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే.. ముందే జాగ్రత్తపడమంటారు. కానీ చాలామంది అలాంటి సమస్య మన వరకు వచ్చినప్పుడు చూద్దాంటే అనుకుంటారు. మరికొంతమంది.. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా వస్తుంది. ఇలా విడిపోయినా.. తాము చేసిన పొరపాట్ల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు. తప్పంతా ఎదుటి వారే చేశారంటూ వారిని నిందిస్తూ మానసికంగా కుంగిపోతుంటారు. దీనివల్ల ఫలితం ఉండకపోగా.. మనోవేదన రెట్టింపు అవుతుంది. ఇలా జరగకూడదంటే.. అవతలి వారిని నిందించడం మాని.. తాము చేసిన పొరపాట్లేంటో గుర్తు తెచ్చుకోమంటున్నారు నిపుణులు. ఇలా స్వయంగా రియలైజ్ కావడం వల్ల కోపతాపాలను తగ్గించుకోవచ్చు. తద్వారా మనసులోని బాధ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ పొరపాటు అవతలి వారిదే అయినా.. వారు మీ నుంచి విడిపోయాక వారిపై కోపం ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయాలు గమనిస్తే.. ప్రతికూల ఆలోచనల్లో నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందచ్చు.
అనుబంధాన్ని తెంచుకునే కంటే.. ఆ ఆలోచనలు, అనుభవాల నుంచి బయటపడడం అంత సులువు కాదు. అయితే ఈ బాధను తమ మనసులో దాచుకోవడం కారణంగానే చాలామంది ప్రశాంతతను కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో లేదంటే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనో.. ఒంటరిగానైనా బాధను భరిస్తారు కానీ ఇతరులతో పంచుకోరు. మనసు ప్రతికూల ఆలోచనలు, బాధతో నిండిపోయినప్పుడు దేనిపైనా ఆసక్తి చూపలేము. కానీ ఈ సమయంలో వేరే అంశాలపై దృష్టి పెట్టడం వల్ల కాస్త ప్రశాంతత సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటిలో డైరీ రాయడం ఒకటి. ఆ క్షణం మీ మనసులో మెదిలిన ఆలోచనలను ఓ డైరీలో రాసుకుని రిపీట్ చేయండి . అంటే.. ఇది ఒక రకంగా మీ బాధను మీతోనే పంచుకోవడమన్నమాట! దీనివల్ల స్వయంగా రియలైజ్ అయి మనసులోని ప్రతికూల ఆలోచనలు క్రమంగా దూరమవుతాయి. ఇలా రోజూ ఓ పావుగంట పాటు డైరీ రాయడం వల్ల.. బాధ, ఒత్తిడి, కుంగుబాటు.. వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది.