Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ ఆచారాలు పాటిస్తారు. ఇందులో కొన్ని వింతైనవి కూడా ఉంటాయి. వివిధ నమ్మకాల మధ్య భారతీయులు జీవిస్తుంటారు. కొన్ని నవ్వు కూడా తెప్పిస్తాయి. అయినా ప్రతీ దానిలో ఏదో నిగూఢ రహస్యం ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది కప్పలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు కురుస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరిపించరు. శుభలేఖలు పంచిపెట్టి, చాలా మంది అతిథులను పిలిచి, కప్పలను వధూవరులుగా రెడీ చేసి వైభవంగా పెళ్లి చేస్తారు. వీటి వివాహ వేడుకల్లో పురోహితుడు మంత్రాలు కూడా చదువుతాడు. కప్పలను పెళ్లి దుస్తులతో అలంకరించి, వాటికి ఆహారం నైవేద్యంగా కూడా పెడుతారు.
ఈ పెళ్లి జరిపిస్తూ వర్షం కురిపించాలని వరుణ దేవుడిని కోరుతారు. భగభగ మండే సూర్యుడి తాపం నుంచి ఉపశమనం కలిగించమని వేడుకుంటారు. అనేక ప్రాంతాల్లో పాటించే ఈ అసాధారణ ఆచారం భారత దేశ గొప్ప, విభిన్న సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
ఈ వివాహాలు హిందూ పెళ్లి మాదిరిగానే ఉంటాయి. కాకపోతే వధువు, వరుడు కప్పలనే మనుషులే పట్టుకుని అలంకరిస్తారు. కప్ప వివాహాలు ఎక్కువగా అసోంలో నిర్వహిస్తారు. ఇక్కడి స్థానిక భాషలో ‘‘భేకులీ బియా’’ అంటారు. భేకులి అంటే కప్ప, బియా అంటే వివాహం అని అర్థం. అసోంలోని జానపద కథల ప్రకారం రైతులు ఒకప్పుడు వర్షం కోసం మేఘాలను అడిగారు. కానీ మేఘాలు కప్పల అరుపులు విన్నప్పుడు మాత్రమే వర్షం పడుతాయని చెప్పాయి. అప్పటి నుంచి కప్పలు అరిచినప్పుడు వర్షాలు పడుతాయని నమ్మడం ప్రారంభించారు.
కప్పల పెళ్లిళ్లలను మన దక్షిణాదిలో కూడా బాగానే చేస్తారు. మన పల్లెల్లో ఇప్పటికీ ఈ నమ్మకం కనపడుతుంది. కప్పతల్లి ఆట అంటూ గ్రామీణ యువత వర్షాల కోసం కప్పల పెళ్లిళ్లు చేస్తారు. భారత ప్రజలు ప్రకృతితో ఎంత మమేకం అవుతారో కప్పల పెళ్లిళ్ల ద్వారా తెలుసుకోవచ్చు.