Donald Trump : తాను అధికారంలోకి వచ్చాక జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తానని, బిడెన్ పరిపాలనలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిరిగి తమ దేశాలకు పంపేందుకు సైనిక సహాయాన్ని ఉపయోగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉందని వారం రోజుల క్రితం జ్యుడీషియల్ వాచ్ ప్రెసిడెంట్ టామ్ ఫిట్టన్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. దీనిపై సోమవారం ట్రంప్ స్పందిస్తూ ‘నిజమే’ అని అన్నారు. అక్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించాలని భావించిన ట్రంప్.. అమెరికా కాంగ్రెస్ నిరాకరించడంతో నిధులను పొందేందుకు 2019లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 25 వేల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్ సరిహద్దు భద్రతా చీఫ్ టామ్ హోమన్ చెప్పారు. లక్షలాది మంది అర్హులైన శరణార్థులు, వలసదారులు అక్రమ వలసదారుల ప్రవాహంతో వెనక్కి నెట్టబడ్డారని కూడా ఆయన అన్నారు వలసదారులందరికీ చట్టంలో నిర్దేశించిన విధి విధానాలను అనుసరించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యాయపోరాటంలో ఓడిపోతే వారిని తిరిగి వారి దేశాలకు పంపిస్తారు.
సరిహద్దు భద్రతకు సంబంధించిన తన వ్యక్తిగత అనుభవాలను హోమన్ పంచుకున్నారు. సరిహద్దు పెట్రోల్ ఏజెంట్లు ఇప్పుడు అక్రమ వలసదారులను ఆపకుండా కేవలం “ట్రావెల్ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారు ఎటువంటి పరిమితులు లేకుండా అక్రమ వలసదారులను అమెరికాలోకి పంపుతున్నారు. వారికి ఉచిత విమాన టిక్కెట్లు, హోటళ్ళు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తారు. అయితే మిలియన్ల మంది అమెరికన్ పౌరులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ పరిపాలన దీనిపై దృష్టి సారించిందన్నారు.
అక్రమ వలసదారుల భారీ బహిష్కరణ అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ (AIC) ఈ చర్య కీలక పరిశ్రమలలో ముఖ్యంగా నిర్మాణం, వ్యవసాయం, ఆతిథ్య రంగాలలో తీవ్రమైన కార్మిక సంక్షోభాన్ని సృష్టించగలదని పేర్కొంది. నిర్మాణ పరిశ్రమలో దాదాపు 14 శాతం మంది కార్మికులు అక్రమ వలసదారులే. ఈ కార్మికులను తొలగించడం వల్ల దేశవ్యాప్తంగా నిర్మాణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది చాలా మంది అమెరికన్ పౌరుల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది.