Donkey Egg Gravel Peach : గాడిద గుడ్డు పెట్టదు. కంకరకు పీచూ ఉండదు. మరి ఈ పలుకుబడి ఎలా పుట్టింది? దీన్ని ఏ అర్థంలో వాడుతున్నారు?
ఈ పలుకుబడి భారతదేశం బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నప్పుడు పుట్టినది. క్రైస్తవ మిషనరీలు మత ప్రచారం కోసం తెలుగు ప్రాంతాల విషయానికే వస్తే కోస్తా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ ఖాళీగా ఉండే సమయాన్ని మరియు అందరూ గుమికూడి ఉండే ప్రదేశాన్ని ఎంచుకునేవారు. రచ్చబండలు, సత్రాలు మొదలైనవి అన్నమాట. ఆయా ప్రదేశాలకు వెళ్లి, అక్కడ పిచ్పాపాటి మాట్లాడుకుంటున్న తెలుగు వాళ్లకు క్రైస్తవ మతం గురించి ఇంగ్లీషులో చెప్పేవారు. ఆనాటి తెలుగు వారికి అది ఏమాత్రం అర్థమయ్యేది కాదు.
కానీ ఈ మిషనరీలు తమ ప్రసంగాన్ని అంతా ఇంగ్లీషులో చెప్పి ముగింపు మాటలుగా “గాడ్ ఇస్ గుడ్…..కాంక్వర్ పీస్ ” అనే వారు. గాడ్ ఇస్ గుడ్ = దేవుడు మంచివాడు. ఎప్పుడూ మన మంచినే కోరుకుంటాడు. కాంక్వర్ ( conquer) = విజయం పీస్ = శాంతి. ఎప్పటికైనా శాంతే గెలుస్తుంది అనేది దీని అర్థం.
మిషనరీలు వారు క్రైస్తవం కోసం మొదట అంతా చెప్పినది చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉండేది తెలుగు వాళ్ళకు. ఎందుకంటే అదంతా ఇంగ్లీష్ లో ఉండేది. అక్షరాస్యత అంతంత మాత్రముగా ఉండే ఆ రోజుల్లో మాతృభాష తెలుగుకే దిక్కులేదు… ఇంకా ఇంగ్లీష్ ఎట్లా అర్థం అవుతుంది ప్రజలకు? కానీ బ్రిటిష్ వారు ఆ చివరి చెప్పిన “గాడ్ ఇస్ గుడ్…. కాంక్వర్ పీస్ ” మాత్రం వారికి గుర్తుండేది.
దాన్ని నిరక్షరాస్యులైన కొంతమంది తెలుగు వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాక్యాన్ని పలకడం రాక, మార్చేస్తూ
గాడ్ ఇస్ గుడ్ = గాడిద గుడ్డు.. కాంక్వర్ పీస్ = కంకర పీచుగా మార్చేశారు. క్రైస్తవ మిషనరీలు సాయంత్రం సమయంలో సత్రాలు దగ్గరకో.. రచ్చబండ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వారు క్రైస్తవ మిషనరీలు అని చెప్పడం రాక.. వారి ప్రసంగాల్లో చివరికి ఈ గాడ్ ఇస్ గుడ్ కాంక్వర్ పీస్ ను మార్చి వేస్తూ.. “గాడిద గుడ్డు కంకర పీచుగాళ్ళు వస్తున్నారు రా” అంటూ అనేవారు.
అంటే వాళ్ల ఉద్దేశం క్రైస్తవ మత ప్రచారకులు వస్తున్నారని అని అర్థం. అలా ఈ పలుకుబడి వ్యాప్తిలోకి వచ్చింది. అంటే ఏమాత్రం అర్థం కాని విషయం గురించి చెబుతున్నప్పుడు గాడిదగుడ్డు కంకర పీచు అని అంటుంటారు.
కృష్ణారావు దుమ్ము