Home Minister Anita : గత 4 నెలల్లో దేశవ్యాప్తంగా రూ.1739 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భవగా ఆమె మాట్లాడుతూ దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. అనేక యాప్ ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. అనేక సామాజిక మాధ్యమాలు, యాప్ లకు పౌరులకు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందని వివరించారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రస్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
ప్రతి రోజు 5, 6 సైబర్ నేరాల ఫిర్యాదులు అందుతున్నాయని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. విద్యార్థులు, వైద్యులు, ఐఏఎస్ లు, ఇలా చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో సైబర్ క్రైం పోర్టల్, మోసగాళ్ల ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తుందని చెప్పారు. 1930 పోర్టల్ కు 98 బ్యాంకులతో అనుసంధానం ఉందని వివరించారు.