KCR తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. ఇప్పటికే పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు ప్రారంభించాయి. అధికార పార్టీ మాత్రం 95% సిట్టింగులకే సీట్లు దక్కుతాయని స్పష్టంగా చెప్పింది. అయితే ఆ పార్టీలో తాజాగా ఒక కొత్త లొల్లి మొదలైంది. సీఎం కేసీఆర్ కు ఇది కొత్త తలనొప్పిగా మారింది. తమ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దు అంటూ అధికార పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు అన్ని చోట్ల దాదాపు ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ఇలా ఫిర్యాదులు ఇస్తున్నవారిలో ఎమ్మెల్యేల అనుచరులు, అనుయాయులు కూడా ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు తిరుగుబావుటా ఎగురవేసి అధిష్టానానికి ఆల్టిమేటం జారి చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేకు మినహా వేరెవరికి ఇచ్చినా సహకరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు టికెట్ ఇవ్వద్దని ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటనలో స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు.నన్నపనేనికి తప్ప వేరే ఎవరికీ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ నన్నపనేనికి ఇస్తే తాము సహకరించబోమని తేల్చి చెప్పారు. మరోవైపు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. ఆయనకు కూడా టికెట్ ఇవ్వద్దంటూ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ఆయన సొంత పార్టీ నాయకులను పట్టించుకోవడంలేదని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఈ నేతల్లో డీసీసీబీ చైర్మన్ మారినేని రవీందర్రావు, జిల్లా రైతుబంధు సమన్వయకర్త లలిత యాదవ్ సహా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు, కీలక నాయకులు ఉన్నారు. మరోవైపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారులను సస్పెండ్ చేయాలని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. ఒక వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా బోధన్, కోదాడ, రామగుండం సహా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై ఐదుగురు కీలక నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. తమలో ఎవరికీ టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో తమ అనుచరులతో ర్యాలీ తీశారు. దీనిపై ఇప్పటికే రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి. అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వద్దని వారు ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు.
అయితే రాష్ర్టంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో ఇది బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే తప్పా, ఈ వేడి చల్లారేలా లేదు. మరికొన్ని నియోజకవర్గాలకు కూడా పాకే అవకాశం ఉంది. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు ఇలాగే ఉంది. అయితే ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ ఇదే అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. పలువురు నేతల డేటా ఆయన వద్ద ఇప్పటికే ఉంది. ఎమ్మెల్యేల వ్యవహారాలు కూడా ఆయన వద్ద రిపోర్టు ఉంది. ఆయనే ఈ విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో మంత్రులను ఈ విషయంలో సమన్వయం చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ఫిర్యాదులు ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఆయన గ్రౌండ్ రిపోర్టు కూడా తెప్పించుకుంటున్నారని సమాచారం. మరి ఆ అభ్యర్థులకు ఇక ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వినిపిస్తున్నది.