
Democracy in AP : దేశంలోనే గతంలో ఎన్నడూ చూడని అత్యంత దయనీయ పరిస్థితులను ఏపీ ఎదుర్కొంటున్నది. నాడు ఏపీ అంటే పచ్చని పైర్లు.. సెలయేటి సవ్వడులు.. అందమైన గ్రామాలు.. ఉత్సవంలా జరిగే పండుగలు..ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో గడిపే రోజులు.. ఇదంతా గతం.. ఇప్పుడు ఏపీ కక్ష సాధింపు రాజకీయాలకు వేదికైంది. గతంలో లేవని కాదు. గతం కంటే భిన్నం. ఏదేమైనా ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నది. 2019లో వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని సంఘటనలు చూసుకుంటే..
ఆగిపోయిన అమరావతి
ఏపీ రాజధాని గా అమరావతిని గత ప్రభుత్వం తెరపైకి తెచ్చి, పనులు కూడా మొదలుపెట్టింది. దేశ ప్రధాని మోదీతో పాటు పలు రాష్ర్టాల సీఎంలు ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పెట్టేసింది. మూడు రాజధానులంటూ తెరపైకి తెచ్చి, నాలుగేళ్లుగా అసలు ఏపీకి రాజధాని అంటూ లేకుండా చేసింది. ఒకసారి విశాఖ, మరోసారి కర్నూలు, ఇంకోసారి అమరావతి పాటపాడుతూ ప్రజలను అయోమయంలోకి నెట్టింది. ఇక భూములిచ్చిన ఎందరో రైతుల కంటతడికి ఈ సర్కారు కారణమైంది.
పోలవరం
ఏపీ జీవనాడిలా పేరున్న పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం చంపేసింది. నత్తనడకన సాగుతున్న పనులతో అసలు ఇంకో పదేళ్లయినా పోలవరం పూర్తవుతుందా అనే అనుమానాలు ప్రజల్లోకి వెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో స్పీడ్ సాగిన పనులు వైసీపీ హయాంలో కేంద్రం ముందు తాకట్టు పెట్టబడ్డాయనే ఆరోపణలకు ఊతమిచ్చాయి.
ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను వినేందుకు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారు. ప్రజల కోసం పట్టెడన్నం పెట్టేందుకు నిర్మించిన అన్న క్యాంటీన్లను మూసివేయించారు. రుషికొండను తొలిచివేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలను ఏపీ లో అడుగుపెట్టాలంటే భయపడేలా పరిస్థితులను మార్చివేశారు. ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా ప్రజల్లోకి వెళ్లని సీఎం, ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడని సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే..ఠక్కున ఏపీ సీఎం అనేలా పరిస్థితులు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలను వేధించడం మొదలుపెట్టారు. నాడు టీడీపీ నేతలే చేశారని ఆరోపించిన కొడికత్తి, వివేకా హత్య కేసులను పక్కదారి పట్టించారు. స్వయంగా వైసీపీ నేతల హస్తమే ఇందులో ఉన్నట్లు తేలడంతో ఇక కేసులను మరుగున పడేశారు. ఇప్పడు ఏకంగా ప్రతిపక్ష పార్టీ అధినేతనే వేధించడం పనిగా పెట్టుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లో ప్రజాస్వామ్యం ఉందా.. అంటే లేదనే అభిప్రాయం ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్నది. గతంలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులను ఏపీలో చూస్తున్నామని నిపుణులే అంటున్నారు. సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఏపీలో ప్రజలను విడగొట్టేలా వైసీపీ రాజకీయాలు మొదలు పెట్టిందని, ఇలాంటి పాలన తో ఆయన భావితరానికి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అంతా అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల తర్వాతైనా ఏపీలో ప్రజాస్వామ్యం విలసిల్లాలని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.