Behavior of AP CM : ఏపీలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పక్షం సంక్షేమ పథకాలను నమ్ముకొని ముందుకెళ్తుంటే, ప్రతిపక్షం ప్రజల చెంతకు వెళ్తూ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు అధికార పక్షం ప్రతిపక్షాలపై దాడికి దిగింది.
అయితే ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందనే ప్రచారం జరుగుతున్నది. గతంలో కంటే టీడీపీ ప్రభావం మరింతగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక తర్వాత ఎలా ఉంటుందో తెలియక, ఒక్కసారైనా టీడీపీ అధినేత ను కేసులతో వేధించాలని సీఎం జగన్ భావించినట్టు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలపై ఇంత దుందుడుకు రాజకీయాలు గతంలో తెలుగు రాష్ర్టాల్లో చూడలేదని, ఇదే మొదటిసారి అనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఒక్క చంద్రబాబునే కాకుండా యువనేత లోకేశ్, టీడీపీకి సహకరిస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను కూడా అవసరమైతే ఇబ్బంది పెట్టాలని, తాను మిగతాది చూసుకుంటానని అధికారులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. చంద్రబాబు ఇమేజీని డ్యామేజ్ చేయాలంటే ఇదే అసలైన టైం అని భావించి ఉంటారని సమాచారం. అయితే ఎన్నికలకు గడువు సమీపిస్తుండగా, ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజల్లో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. చంద్రబాబుకు రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న గ్రాఫ్ ను తుంచేయడం లక్ష్యంగా కనిపిస్తున్నది. మరోవైపు టీడీపీ కి జనసేన దగ్గరవుతుండడంతో, వచ్చే ఎన్నికల్లో ఇక వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా చేయాలని భావించారట.
అందుకే పాత, ఆధారాల్లేని కేసులను వెలికి తీసి చంద్రబాబును అరెస్ట్ చేయించారని చెబుతున్నారు. ఒక్క కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించారని కూడా ప్రచారం జరుగుతున్నది. వారి కదలికలు కూడా అదే దిశగా ఉండడంతో, దీని వెనుక ఎంత కుట్ర దాగుందో చెప్పకనే అర్థమవుతున్నది. ఇలాంటి కక్షసాధింపు చర్యలు రాజకీయాల్లో కొత్తేమి కాకున్నా, ఏపీలో మాత్రం జగన్ వ్యవహారిశైలి తెలిసిన ప్రతి ఒక్కరూ, చంద్రబాబు భద్రతపై అనుమానిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏపీ ఇంకెన్ని కక్ష రాజకీయాలు చూడాల్సి వస్తందో అని చర్చలు జోరుగా సాగుతున్నాయి.