
Dowry taken : వరకట్నంపై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని కలిగి ఉంటుంది. కేరళలో వరకట్నంపై విశ్వ విద్యాలయాల నుంచే స్పష్టమైన అవగాహన ఉంటుంది. కేరళలోని యూనివర్సిటీల్లో ‘నేను వరకట్నం తీసుకోను.. ఇవ్వను.. ప్రోత్సహించను’ అని హామీ ఇచ్చిన తర్వాతే ఎంట్రీ ఉంటుంది. ఈ మేరకు స్వీయ అంగీకార పత్రంపై అక్కడి విద్యార్థులు సంతకం చేయాలి. దీంతో పాటు తల్లిదండ్రుల సంతకం తీసుకున్న తర్వాతే విద్యార్థులకు యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది.
భవిష్యత్తులో వారు కట్నం అడిగినా, తీసుకున్నా పోలీసులతో పాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు అన్నమాట. దీనిపై యూనివర్సిటీ వాస్తవాలు తెలుసుకొని, ఆరోపణలు నిజమని తేలితే వారి డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది. ఆ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైచ్ ఛాన్సిలర్ గా ఉన్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రెండేళ్ల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేలా కసరత్తు సాగుతోంది.
వరకట్న వేధింపుల కేసులు దేశంలో ఏటా పెరుగుతున్నాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా వరకట్నం కోసం గృహహింస కేసులు పెరుగుతుండగా ఈ జాబితాలో 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 75 శాతంతో అసోం మొదటి, 48.9 శాతంతో ఢిల్లీ 3వ స్థానంలో ఉన్నాయి.
గృహహింసలో అత్యధిక కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వరకట్నం, మహిళలపై జరుగుతున్న హింసపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. వరకట్నంపై కేరళ అనుసరిస్తున్న విధానాన్ని హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు.
ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వరకట్నంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చిందని గుర్తించారు. ఇలాంటి విధానం తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన పంపారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది.
కేరళ ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించి, విధి, విధానాలపై కసరత్తు చేయనున్నట్లు తెలిసింది. త్వరలో ఉన్నత విద్యామండలి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.