Cyber Crimes :
సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో సైబర్ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం పేరిట వల వేస్తున్నారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో చాటింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ముందు డబ్బులు డిమాండ్ చేస్తారు. అడిగినంత ఇవ్వక పోతే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తుంటారు. అయితే ఈ బ్లాక్ మెయిలింగ్ ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు. రోజుల తరబడి సాగుతూనే ఉంటుంది.
సోషల్ మీడియానే ఆయుధం
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, డేటింగ్ యాప్స్.. ఇవే మాయగాళ్లకు అసలైన అస్త్రాలు. ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్‌లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. తమ రిక్వెస్ట్కు స్పందించగానే ఛాటింగ్ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు తదితర విషయాలను ధ్రువీకరణ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్ ఫోన్‌కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ట్రాప్లో పడ్డట్టు నిర్దారణకు వచ్చాక ప్లాన్ను అమలు చేస్తున్నారు.
ఆకర్షణీయమైన ఫొటోలతో ముగ్గులోకి దింపుతారు. నాలుగు ఆకట్టుకునే మాటలతో.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువునా ముంచేస్తారు. ఒక్క బలహీన క్షణంలో చేసిన పొరపాటును.. బలమైన ఆయుధంలా మార్చుకుని అందినకాడికి దోచేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల మాటున వలపు వల విసిరి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. అయితే ఇందులో బాధితులు మగవారే కాదు. ఆడవాళ్లు ఉంటున్నారు. టెన్త్ క్లాస్ స్టూడెంట్ల నుంచి వృద్ధుల దాకా చిక్కారంటే అంతే సంగతి. వారి పైశాచిక ఆనందానికి ప్రాణాలు తీసుకుంటున్న వారు ఉన్నారు.
హైదరాబాద్ లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యాపారి స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేయగా యువతి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశారు. ఇక వెంటనే ఛాటింగ్ మొదలైంది. ఫోన్ నంబర్లు కూడా ఇచ్చకున్నారు.
సదరు యువతి ముంబయిలో ఉన్నానని.. రెండ్రోజులు సరదాగా గడిపేందుకు వస్తానంటూ ప్రయాణ ఖర్చులకు గాను రూ.50వేలు జమ చేయించుకుంది. ఆరోగ్య సమస్యలతో రాలేక పోతున్నానంటూ వాయిదా వేస్తూ వచ్చింది. అతడు కుటుంబ, వ్యక్తిగత విషయాలను వాట్సాప్ వీడియోకాల్ ద్వారా మాట్లాడుతున్నపుడు రికార్డు చేసి బెదిరింపులకు గురి చేయడం మొదలు పెట్టింది. దీంతో భయపడిన సదరు వ్యాపారి రూ.20లక్షల దాకా ఇచ్చాడు.
ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసుల దర్యాప్తులో ఆమె మోసాలను చూసి విస్తుపోయారు. ముంబయికి చెందిన యువతి ఎంతోమందిని ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించారు. అవతలి వారికి నమ్మకం కుదిరేలా వ్యవహరిస్తున్నది.
అవతలి వ్యక్తి బలహీనతలను అంచనా వేస్తుంది. అతడు భార్యతో ఎలా ఉంటాడనే వివరాలను సేకరించి డబ్బు వసూలు చేయడం ఆమె శైలి అని పోలీసులు గుర్తించారు. మాయలేడి జాబితాలో హైదరాబాద్ కు చెందిన ఎంతో మంది మోసపోయారని పోలీసుల విచారణలో తేలింది. కానీ బాధితుల్లో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసులను సంప్రదించారు. బుక్ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి ఇన్‌స్టా ద్వారా పరిచయమైన ఒక మహిళ ముంబయి రమ్మంటూ ఆహ్వానించగానే వెళ్లాడు. అక్కడ ఇద్దరూ హోటల్‌రూమ్‌లో ఉండగా వచ్చిన అగంతకులు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించి భారీగా డబ్బు లాగినట్లు సమాచారం. నగరానికి వచ్చాక విషయం మిత్రులతో పంచుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వలపు వలతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు ప్రశ్నిస్తే కిలేడీలు ఎదురు తిరుగుతున్నారు.
తమనే లైంగికంగా వేధించారంటూ ఛాటింగులు, వ్యక్తిగత ఫొటోలు బయటపెట్టగానే బాధితులు మౌనం గా ఉండాల్సి వస్తున్నది. ఈ తరహా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో వెనుకడుగు వేస్తున్నారని నగర సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వారితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.