ఈ శతాబ్ధంలోనే టర్కీ భూకంపం అతిపెద్దదిగా మారుతోంది. ఇప్పటికే 30వేల మంది శిథిలాల కింద చనిపోయినట్టు లెక్కతేలింది. ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. సునామీలు, భూకంపాలను మనం ముందుగానే కనిపెట్టడం కష్టం. అవి ఎప్పుడు వస్తాయో.. ఎలా వస్తాయో తెలియదు. టర్కీలో తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో మొత్తం కుప్పకూలి కొన్ని వేల మంది మరణానికి కారణమైంది. ఈ భారీ భూకంపం విషాదం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
అయితే టర్కీ భూకంపాన్ని ముందే ఊహించాడు నెదర్లాండ్ కు చెందిన పరిశోధకుడు. ఇంత పెద్ద భూకంపం.. 7.5 తీవ్రతతో వస్తుందని అంతుకు మూడు రోజుల ముందుగానే పసిగట్టి ట్వీట్ చేశారు. అయితే ఇతడి ట్వీట్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వచ్చాక ఇతడి ప్రతిభ తెలుసుకొని ఇప్పుడు అందరూ ఆయన్ను ఫాలో అవుతున్నారు.
భూకంపాలు, సునామీలు వచ్చే ముందు ప్రకృతిలో కొన్ని విచిత్రమైన మార్పులు వస్తుంటాయి. అవి ప్రమాదాలకు సంకేతం అని ఇలాంటి నిపుణులు గుర్తిస్తారు. ఇలా నెదర్లాండ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్ కూడా కొంతకాలంగా భూకంపాలపై పరిశోధన చేస్తూ ఈ అసాధ్యమైన దాన్ని కనుగొన్నాడు.
టర్కీ భూకంపానికి ముందే ఫ్రాంక్ హూగర్ బీట్స్ ముందస్తు అంచనావేశాడు. ‘సౌత్ సెంట్రల్, సిరియా, టర్కీ, జోర్డాన్, లెబనాన్ పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి 6న తెల్లవారుజామున భారీ భూకంపం వస్తుందని ట్విట్టర్ లో ఫ్రాంక్ ఏకంగా ఫిబ్రవరి 3వ తేదీనే తెలియజేయడం విశేషం.
నెదర్లాండ్ లోని సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే విభాగంలో పరిశోధకుడు ఫ్రాంక్. పలుమార్లు భూకంపానికి సంబంధించిన పలు హెచ్చరికలు చేసినా అవి నిజం కాలేదు. కానీ ఈసారి ఆయన చెప్పిన హెచ్చరిక నిజమైంది. ఈసారి ఖచ్చితంగా ఆయన అంచనా నిజమైంది. తాను చెప్పింది నిజం కావడం దురదృష్టకరమని.. వేలమంది ప్రాణాలు పోవడం బాధగా ఉందని ఫ్రాంక్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఇక వచ్చే భూకంపం భారత ఉపఖండంలో వస్తుందని.. అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంక్ బాంబు పేల్చడం గమనార్హం. దీంతో భారతీయులంతా ఈయన ట్వీట్ కు హడలి చస్తున్నారు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
మొత్తంగా ఈ డచ్ పరిశోధకుడు ముందే గమనించి భూకంపాన్ని అంచనావేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయనను దేశ విదేశాల్లో ఎంతో మంది ఫాలో అవుతూ భూకంపాలపై అడిగి తెలుసుకుంటున్నారు.