Early sick leave : ప్రతి కార్పొరేట్ ఉద్యోగి సుదీర్ఘ వారాంతం కోసం ఎదురుచూస్తున్నారు. తమకు ముందస్తుగా అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉందంటూ సిక్ లీవ్ కోసం హెచ్ఆర్ లకు విన్నవించుకుంటున్నారు. ముందస్తు సిక్ లీవ్ కోసం ఉద్యోగులంతా దరఖాస్తు చేసకుంటున్నారంటూ సోషల్ మీడియా అంతా ఊగిపోతున్నది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న సెలవు కావాలంటూ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు కావాలని కోరుతున్నారు. దీంతో యాజమాన్యాలు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
ఇదీ విషయం
ఈ నెల 12,13 శని, ఆదివారాలు వారాంతపు సెలవులు. 15న స్వాతంత్ర్య దినోత్సవం ఎలాగూ సెలవే. అయితే మధ్యలో ఉన్న ఒక్క రోజైన ఆగస్టు 14న సెలవు దొరికితే చాలని భావించారు. లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేసేందుకు కార్పొరేట్ ఉద్యోగులు ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. ఐదు రోజుల పాటు సుదీర్ఘ విరామం పొందవచ్చు. రాబోయే సోమవారంరోజున ఈ సెలవును పొందేందుకు కొంతమంది ఉద్యోగులు ఎలా తీవ్రంగా ప్రయత్నిస్తారనే దానిపై నెటిజన్లు ఇప్పుడు ఫన్నీ మీమ్స్, జోకులు చేస్తున్నారు.
అయితే లాంగ్ వీకెండ్‌లో డిమాండ్ పెరుగుతుందనే ఆశతో దేశీయ విమానయాన సంస్థలు ఇప్పటికే విమాన టిక్కెట్ల ధరలను పెంచాయి. ముంబై, ఢిల్లీ నుంచి ప్రముఖ హాలిడే స్పాట్లతో పాటు గోవా, ఆగ్రా, కొచ్చి, మధురై, షిర్డీ, తిరుపతి లాంటి ఆధ్యాత్యిక ప్రదేశాల పర్యటనకు సంబంధించి విమాన ఛార్జీలను కూడా విమానయాన సంస్థలు పెంచాయని తెలుస్తున్నది.