
Women CEO of Twitter : సోషల్ మీడియా మాధ్యామాల్లో ట్విట్టర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖులు ఎక్కువగా వాడే సోషల్ అకౌంట్ గా దీనికి పేరుంది. అయితే బిలియన్లు ఖర్చు చేసి ఇటీవల దీనిని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు ఈ సంస్థలో జరిగాయి. పాత సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. బ్లూ టిక్ విషయంలో కూడా మార్పులు చేయగా, విమర్శలు రావడంతో కొంత వెనక్కి తగ్గారు.
సంచలనం సృష్టిస్తున్న మస్క్ నిర్ణయం..
ట్విట్టర్ కు మహిళను సీఈవో గా నియమిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. ఇప్పటివరకు సీఈవోగా ఉన్న మస్క్ ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కంపెనీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ అండ్ సీటీవోగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. అయితే కొత్త సీఈవో ఎవరనేది మాత్రం ఇంకా ఆయన వెల్లడించలేదు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం లిండా యాకారినో అనే మహిళ సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తున్నది. ఆమె ప్రస్తుతం ఎన్బీసీయూ అడ్డర్టైజింగ్ హెడ్ గా ఉన్నారు. ఇటీవల ఒక సెమినార్ లో మస్క్ ను కలిసి నట్లుగా సమాచారం. 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ఎన్బీసీయూ, ట్విట్టర్ భాగస్వామ్యంపై ఆమె ఇటీవల పలు ట్వీట్లు చేయడం ఇక్కడ విశేషం.
ప్రస్తుతం ఈమె పేరైతే ట్విట్టర్ సీఈవోగా (CEO of Twitter) ప్రచారంలో కి వచ్చింది. మరి ఎలాన్ మస్క్ ఎవరిని ఎంపిక చేశారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ట్విట్టర్ సీఈవో అంటే మాటలా మరి. ఆ స్థాయిలో పని చేసే సత్తా ఉన్న మహిళను ఎలాన్ మస్క్ ఇప్పటికే ఎంపిక చేశారని , ఇక పేరు ప్రకటించడమే తరువాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు.