
Emergency days : రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ప్రగతి భవన్ లో భేటి అయ్యారు. మొదట లంచ్ చేసిన వీరు అనంతరం భేటీ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ను కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడంలో భాగంగా విపక్షాలను కూడగట్టేందుకు కేజ్రీవాల్ ఆయా రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు కూడా వచ్చారు. ఆయనతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను వెంట తీసుకువచ్చారు. ప్రగతి భవన్ లో వీరి భేటి కొనసాగింది. భేటీ పూర్తయిన తర్వాత ముగ్గురు సీఎంలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టుకు వెళ్లామని తెలిపారు. సుప్రీం తమకు అనుకూలంగా తీర్పు వెలువరించినా కేంద్రం పట్టించుకోవడం లేదని దీంతో అన్ని రాష్ట్రాల మద్దతు కూడగట్టుకొని కేంద్రంపై ప్రజాస్వామికంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హయాంలో అరాచకాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాలను ఎలాగైనా ఇబ్బందులు పెట్టి గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఆర్డినెన్స్ ల మీద ఆర్డినెన్స్ లు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సబంధించి తెచ్చిన ఆర్డనెన్స్ సుప్రీం కోర్టులో వీగిపోయినా కేంద్రానికి బుద్ది రావడం లేదని ధ్వజమెత్తారు. అధికారం అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్రాల సీఎంల చేతుల్లోనే ఉండాలని సుప్రీం చెప్పినా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో అభివృద్ధి చాలా జరిగిందని, ఇది చూసి ఓర్వలేకనే కేంద్రం అక్కడి పాలనా పగ్గాలను బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు.