ఈటల వర్సెస్ బండి సంజయ్ కొట్లాట ఇంకా ముగియలేదా…? ఈటల లేకుండా బండి సంజయ్ హుజురాబాద్ కు ఎందుకెళ్లినట్లు? బండి ముందే జై ఈటల నినాదాల వెనుక రాజకీయం ఉందా…? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ బీజేపీలో వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ కు, బండి సంజయ్ కు పడటం లేదని… రెండు వర్గాలున్నట్లు ఉన్న ప్రచారం కొత్తేమీ కాదు. ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి అని, బండికి కేంద్రమంత్రి పదవి ఇస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అవన్నింటినీ నేతలు కొట్టిపారేస్తూ వచ్చారు.
కానీ, తాజాగా హుజురాబాద్ బీజేపీలో జరిగిన అంశాలే మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ హైదరాబాద్ లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సందర్భంలో బండి సంజయ్ హుజురాబాద్ లో పర్యటించారు. ఈటల లేకుండా హుజురాబాద్ కు అధ్యక్షుడు వెళ్లారంటేనే ఏదో ఉందని అంతా అనుకున్నారు.
కార్నర్ మీటింగ్స్ కు పెద్ద నేతలు ఒకేచోట ఉండొద్దని, అందుకే బండి సంజయ్ పర్యటనలో ఈటల లేరని బీజేపీ వర్గాలు పైకి చెప్తున్నాయి. కానీ అక్కడ జరిగింది కార్నర్ మీటింగ్స్ కాదు. పైపెచ్చు స్థానిక నేతలకు ఎదురువుతున్న ఇబ్బందులను, వారిపై పెడుతున్న కేసులను బండి సంజయ్ అక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. ఎస్సైకి వార్నింగ్ ఇచ్చారు. మాములుగా అయితే ఇలాంటి సందర్భాల్లో స్థానిక నేతగా, ఎమ్మెల్యేగా ఈటల ఉండాలి. కానీ లేరు… పైగా అక్కడ బండి సంజయ్ ముందే జై ఈటల నినాదాలు మార్మోగటం కూడా చర్చనీయాంశంగా మారింది.
బండి టూర్, ఈటల లేకపోవటం చూస్తుంటే ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడుతోందని, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైకి ఎంత లేదని చెప్పుకుంటున్నా… నాయకుల క్యాడర్ లో కనపడుతుందని, అదే బండి సంజయ్ హుజురాబాద్ టూర్ లో కనపడిందని స్పష్టం చేస్తున్నారు.