
EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు నగరాల మధ్య విద్యుత్తు (ఈవీ) బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిక్స్ బస్ ఇండియా, ఈటీవో మోటార్స్ భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ఈవీ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అలాగే, విజయవాడ-విశాఖపట్నం మార్గంలో కూడా విద్యుత్తు బస్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు.
సేవలు ప్రారంభమైన తొలి నాలుగు వారాల పాటు ప్రయాణికులు కేవలం రూ. 99తో హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించవచ్చు. ఈ బస్సులు అన్ని ప్రభుత్వ ప్రయాణ సదుపాయాలకు అనుకూలంగా ఉంటాయని, కేవలం 5 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో బస్సులో 49 మంది ప్రయాణికులు గమ్యస్థానానికి వెళ్ళే వీలుంది. త్వరలోనే స్లీపర్ కోచ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈవీ బస్సులు పర్యావరణ హితంగా, ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.