
Pawan Kalyan : కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినంత సంతృప్తిని తాము పొందామని ఆయన అన్నారు. 2019లో ఎదురైన ఓటమి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ, తనను, తన పార్టీని అణచివేయడానికి జరిగిన ప్రయత్నాలను పవన్ వివరించారు.
పవన్ కల్యాణ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
గెలుపు ఓటముల ప్రస్తావన:
“మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు.” అని పవన్ అన్నారు.
“21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.” అని తెలిపారు.
-రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు:
“మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు.” అని పవన్ ఆరోపించారు.
– జనసేన సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు:
“జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశాం.” అని పవన్ అన్నారు.
“జనసేన సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే.. ఇక్కడున్న జనసైనికులంతా ప్రాణాలకు తెగించి వచ్చారు. 450 మంది జనసైనికులు సినిమాలను కాదు.. సిద్ధాంతాలను నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం ఇక్కడ సినిమాల గురించి మాట్లాడవద్దని చెబుతున్నా.” అని విజ్ఞప్తి చేశారు.
-సినిమాలు, రాజకీయ ప్రస్థానం:
“నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే. ఖుషీ సినిమా చూసి గద్దరన్న నన్ను ప్రోత్సహించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక.” అని పవన్ తెలిపారు.
“నేను డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనే వారు. బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారు’’ అని పవన్ అన్నారు.
పవన్ కల్యాణ్ ప్రసంగం జనసేన కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.