
Ex-minister Anil out : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా విభేదాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నెల్లూరులో అధికార వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ కు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ సొంత బాబాయ్ రూప్ కుమార్ ఈ గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. దీంతోపాటు మరో వైకాపా నాయకుడు ద్వారకానాథ్, మరికొందరు కార్పొరేటర్లు కూడా అనిల్ తో విభేదిస్తున్నారు. వీరి మధ్య వర్గ పోరు తీవ్రస్థాయి కి చేరింది.
అయితే ఈ అంశంపై నెల్లూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ ను సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలిపించుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అనిల్ తో అరగంటకు పైగా సీఎం సమావేశం అయ్యారు. అయితే ఇటీవల ‘గడప గడపకు’ ‘జగనన్న సురక్ష’ ఇలాంటి పథకాలపై నియోజకవర్గ వైకాపా ఇన్చార్జిలతో సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి అనిల్ రాలేదు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో తిరగలేదని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. వారి పనితీరును మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. అయితే సోమవారం సీఎం జగన్ అనిల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నియోజకవర్గంలో విభేధాలపై వార్తా కథనాలు వస్తుండడంతో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తున్నది. అందర్నీ కలుపుకొని పోవాలని, విభేదాలు పక్కన పెట్టాలని సూచించినట్లు సమాచారం. పార్టీ బలోతం పైనే దృష్టి పెట్టాలని రానున్న సమయం అతి కీలకమని కొంత సమయమనం పాటించాలని అనిల్ కు సూచించినట్లు తెలుస్తున్నది.
అయితే రెండు రోజుల క్రితం అనిల్ నిర్వహించిన సమావేశంలో మాత్రం ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపాడు. ఇన్నాళ్లూ చిన్న బ్రేక్ ఇచ్చా అంతే. తనలోని ఆ ఫైర్ అలాగే ఉందంటూ సినిమా డైలాగ్ లతో రెచ్చిపోయారు. కామ్‌గా ఉంటే కొందరు రెచ్చిపోతున్నారు. ఇక కాస్తోండి, నేనేంటో చూపిస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఎవ్వడికీ తలవంచను. ఎంత పెద్దోడు ఎదురొచ్చినా రొమ్ము చీల్చుకుంటూ ముందుకెళ్తా. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్లూ మీరు ఆడుకున్నారు, ఇకపై అనిల్ ఆట ఎలాగుంటుందో చూస్తారంటూ సవాల్ విసిరారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్‌కి దూరం చేయలేరన్నారు. జగన్‌కి మిలిటెంట్ స్క్వాడ్‌లాంటోడిని. నా గుండె చప్పుడు జగన్. నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ జగన్‌తో నే ఉంటా అంటూ మాట్లాడాడు.
అయితే ఈసారి అనిల్ కు టికెట్ దక్కుతుందో లేదోననే అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు కీలక కుటుంబాలు, నేతలు టీడీపీ గడప తొక్కాయి. ఇక అనిల్ వ్యవహారం వైసీపీకి చేటు తెచ్చేలా కనిపిస్తున్నది. దీంతో వైసీపీ అధినేత , సీఎం జగన్ అనిల్ కు టికెట్ ఇచ్చే అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఈ సారి నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరో వైపు నెల్లూరులో టీడీపీ నిండిన కుండలా మారింది. ఈ సారి బలమైన సైన్యంతో దూసుకువస్తున్నది. ఈ నేపథ్యంలోనే అనిల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ జనం నోళ్లలో నానేలా చూసుకుంటున్నారు. అటు అధిష్టానం కూడా తనవైపు చూసేలా చేసుకుంటున్నారు.