Mushirabad : మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా కేటీఆర్ కారుపై దాడి జరిగింది. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. కొందరు కేటీఆర్ కారు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కగా పోలీసులు లాక్కెళ్లారు. ఆందోళనకు దిగిన వారి చేతిలో కొండా సురేఖ ఫ్లెక్సీ ఉంది. దీంతో ముషీరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక కేటీఆర్ మూసీ బాధితుల పరామర్శపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అంబర్ పేట్, గోల్నాకలో కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల కార్యకలాపాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తొలి ప్రక్రియలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, రసూల్‌పురా, శంకర్‌నగర్ ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ సమయంలో అధికారులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. వస్తువులు తీసుకునే వరకైనా ఆగాలని ప్రజలు వాగ్వాదానికి దిగారు. అయినా వారి మాట వినకుండా అధికారులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉన్న ఫళంగా ఇళ్లు కూలగొడితే.. ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు.
అనంతరం గచ్చిబౌలిలో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రామమ్మకుంట చెరువు బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. తెలిసిన అధికారులంతా బఫర్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్మిస్తే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో హైడ్రాపై సోమవారం విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. తాము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చివాట్లు పెట్టింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి తహసీల్దార్ చెబితే కూల్చేస్తారా అని కమిషనర్‌ను ప్రశ్నించింది. అమీన్‌పూర్ తహసీల్దార్‌పై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 48 గంటల్లో భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూల్చేస్తారంటూ ధర్మాసనం సీరియస్ అయింది.