Fish curry తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేపల కూర పెట్టాలని అనుకుంటుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరుపుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులు దీనిపై సర్వే నిర్వహించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయంతో చాలా మంది విద్యార్థులు మరింత పోషకాహారం పొందే వీలుంటుంది. అయితే చేపల నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి మరి. ఇప్పటికే ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ అవుతూ చాలా మంది రోగాల భారిన పడుతున్నారు.
ఒక్కో విద్యార్థికి ఎంత మాంసం అందించాలి. ఎన్ని చేపలు అవసరం అవుతాయి. దీనికి తోడు వారానికి ఎన్ని రోజులు అందించాలి, నిధులను ఎలా సమకూర్చాలి అనే అంశం ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీటన్నింటిపై ఒక అంచనాకు రావడం పూర్తయిన తర్వాత అమల్లో పెట్టేలా చూస్తారని తెలుస్తోంది. ఇది కనుక అమల్లోకి వస్తే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరింత మేలు చేసినది అవుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద సొమ్ము లేదు కానీ చేపల కూర పెడతారా? అంటూ కామెంట్లుకూడా పెడుతున్నారు. ఏది ఏమైనా ఇది అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.