Vandhe Bharat Trains : ఇటీవల దేశంలో వందే భారత్ ట్రైన్లకు ప్రాచుర్యం పెరుగుతున్నది. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ రైళ్లు సామాన్య ప్రజల ఆదరణను పొందుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోనూ ప్రస్తుతం ఈ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. అయితే మంగళవారం ఒకే రోజు ఐదు కొత్త వందే భారత్ ట్రైన్లను పట్టాలెక్కించారు. ప్రధాని మోదీ స్వయంగా జెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పీఎం నరేంద్రమోదీ జెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను కలిపేలా ఈ రైళ్లు పట్టాలపై పరిగెత్తనున్నాయి.
మంగళవారం ఉదయం రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, భోపాల్(రాణికమలాపతి) జులుర్, ఖజురహో భోపాల్ – ఇందౌర్, హతియా-పట్నా, ధార్వాడ్ – బెంగళూరు: గోవా(మర్గావ్)- ముంబయి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ను ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను స్వయంగా, మిగతా మూడు రైళ్లను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ వందేభారత్ రైలులో ప్రయాణించి చిన్నారులతో ఆయన ముచ్చటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని మోదీ వెంట ఉన్నారు. ఒకే రోజు ఇన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే మొదటిసారి.
అంతకుముందు ఉదయం భోపాల్ ఎయిర్ పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్కు ప్రధాని హెలికాప్టర్లో చేరుకోవాల్సి ఉంది. వాతావరణం అనుకూలించని కారణంగా ఆయన రోడ్డు మార్గంతో స్టేషన్ కు చేరుకున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జి ఆశిష్ అగర్వాల్ తెలిపారు. అయితే మధ్యప్రదేశ్లో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ పై మోదీ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఐదు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించినట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఎన్నికలున్నాయంటే ఆ రాష్ర్టంలో మోదీ వాలిపోతారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.