
decade celebrations : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం ‘దశాబ్ధి ఉత్సవాలు’గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు వేడుకలను ఎన్నడూ లేనంత గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటుంది. దీనిలో భాగంగానే రోజు వారీ కార్యక్రమాలపై షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన నాటి జ్ఞాపకాలను ప్రజలకు తెలియజేసేలా రాష్ట్రం సాధించిన ప్రగతి అందరికీ చూపించేలా కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించి కార్యాచరణకు సంబంధించి రేపు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం.
మొత్తం 21రోజుల పాటు జరిగే దశాబ్ధి వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. కేసీఆర్ తో పాటు రాష్ట్రంలోని మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీంతో వేడుకలు షురూ అవుతాయి. జూన్ 3న రైతు దినోత్సవం నిర్వహిస్తారు. 4న తేదీన పోలీసుల ఆధ్వర్యంలో ‘సురక్ష దినోత్సవం’, 5న తెలంగాణ ‘విద్యుత్ విజయోత్సవం’ నిర్వహిస్తారు. ‘సింగరేణి సంబురాలు కూడా అదే రోజు ఉంటుంది. 6వ తేదీ ‘పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ ఉంటుంది. 7వ తేదీ ‘సాగునీటి దినోత్సవం’, 8వ తేదీ ‘ఊరూరా చెరువుల పండుగ’, 9వ తేదీ ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ నిర్వహిస్తారు. ఇక జూన్ 10న సుపరిపాలన దినోత్సవంగా ‘జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనాలు’ ఉంటాయి. జూన్ 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ నిర్వహిస్తారు.
జూన్ 12వ తేదీ స్వరాష్ట్రం పేరిట అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులతో ‘రన్’ ఉంటుంది. 13వ తేదీ ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’. 14వ తేదీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవాన్ని, జూన్ 15వ తేదీ తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తారు. 16వ తేదీ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని, 17వ తేదీన తెలంగాణ గిరిజన ఉత్సవం, జూన్ 18న ‘తెలంగాణ మంచినీళ్ల’ పండుగ. జూన్ 19న తెలంగాణ హరిత ఉత్సవం, 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవం ఉంటుంది. 21వ తేదీన ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉంటుంది.
చివరి రోజు 22వ తేదీన ‘తెలంగాణ అమరుల సంస్మరణ’ కార్యక్రమాలు ఉంటాయి. హైదరాబాద్ లో అమరుల స్మారకార్థం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ ఉంటుంది. హైదరాబాద్ లో నిర్మించిన అమరుల స్మారక స్తూపాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయి.