
YCP Leaders : వైసీపీలో కొంత కాలంగా కొందరు పార్టీ సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు అధిష్ఠానం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరవడం లేదు. గత ప్రభుత్వం తమను ఎంత ఇబ్బంది పెట్టినా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన వారు కొందరు తమను పార్టీ గుర్తించడం లేదని, కొందరికే అన్నీ దక్కుతున్నాయనే నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిపై పార్టీ దృష్టి పెట్టింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తుండగా ఈ వేడిని చల్లార్చే పనిని పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకున్నారు.
మంగళగిరిపై ప్రధాన దృష్టి..
మంగళగిరిపై వైసీపీ ప్రధాన దృష్టి పెట్టింది. టీడీపీ యువనేత లోకేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో, వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. దీంతో మంగళగిరిలో అసంతృప్తి నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి శంకర్ రెడ్డి(వేమారెడ్డి)కి మంగళగిరి, తాడేపల్లి నగర పాలక పరిధి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
అందరికీ సముచిత స్థానం కల్పించడంలో భాగంగానే పార్టీ ఈ అవకాశం కల్పించిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా, స్థానికంగా ఒక వర్గానికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సారి మంగళగిరి సీటు హాట్ గా మారనుంది. లోకేశ్ ఇక్కడి నుంచే మరోసారి బరిలో దిగనుండడం ఇందుకు కారణం కాగా, వైసీపీ అప్పుడే దిద్దుబాటు చర్యలకు దిగడం ఈ వేడిని మరింత పెంచుతున్నది. ఒక్క మంగళగిరిలోనే అసంతృప్తి నేతలపై దృష్టి పెట్టారా.. రాష్ర్టవ్యాప్తంగా ఇదే రీతి కొనసాగుతుందా.. త్వరలోనే తెలియనుంది.






