-25 శాతం తగ్గిన సాగు: తాగు సాగు నీటి ఎద్దడి: నిత్యవసరాలకు డిమాండ్ !
-మంత్రుల బూతు పురాణం – కరకట్టపై ‘ప్రజా వేదిక’ ధ్వంసం – మూడు రాజధానులు – భూకబ్జాలు – ఇసుక మట్టి తవ్వకాలు – చంద్రబాబు అరస్ట్ : ఎన్నికల పొత్తులు !
-ఇవి కదా చర్చోప చర్చలు..
Food shortage : దేశంలో రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తున్నారు. ఆంధ్ర లో ఉద్యోగులు జీతాల కోసం ధర్నా చేస్తున్నారు కానీ మూడు పంటలు పండే 14 లక్షల సుక్షేత్రమైన పంట భూములు బీడుపడ్డాయి. 26% ఆహార ధాన్యాలు ఉత్పత్తి తగ్గింది. పప్పు ధాన్యాల ధరలు పేలాల వేగిపోతున్నాయి. మూడున్నర లక్షల ఎకరాలలో శనగ పంట అంటే 32 శాతం తగ్గింది; మినుములు 28 శాతం, పెసలు 39 శాతం, నూనె గింజలు – మొక్కజొన్న 25 శాతం తగ్గాయి. మిచోంగ్ తుఫాన్ తర్వాత చుక్క నీరు ఆకాశాల నుంచి పడలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. 400 రూపాయల గ్యాస్ సిలిండర్ 1100 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, కరెంట్ బిల్లులు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించక రైతు కూలీగా – వలస కూలీగా మారాడు. గ్రాసం దొరకక పాడి పశువుల పెంపకానికి స్వస్తి చెప్పారు. మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం కూడా తగ్గిపోయింది. రూపాయి విలువ తగ్గిపోతుంది. తెల్లవారితే చాలు ఊరేగింపులు, వేల లక్షల మందితో సమావేశాలు. ఎన్ని పని గంటలు వృధా అవుతున్నది..? ఎంత ఆయిల్ తరిగిపోతున్నది. .? సామాజిక స్పృహ ఉన్న ఏ ఒక్కరికైనా ఆలోచించారా..? గళం విప్పారా..? ఈ సమాజం తరిగిపోతున్న విదేశీ నిల్వలు, పెరుగుతున్న రాజకీయ బహిరంగ సమావేశాలు, బారులు తీరుతున్న వాహనాలు, దెబ్బతింటున్న జాతీయోత్పత్తి – పర్యావరణం తదితర అంశాలపై ఎందుకు స్పందించదు..?
అడుగంటుతున్న జలాశయాలు, బీడు పడిన భూములు, తరుముకొస్తున్న కరువు రాజకీయ పక్షాలకు పట్టవా..? ప్రజా సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజకీయ పక్షాలు ప్రత్యర్థుల అరెస్టులు – బహిరంగంగా ప్రత్యర్థులను దూషించడం – కులమత కార్యకలాపాలతో పబ్బం గడుపుకోవడం ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా..? విశ్రాంత అధికారులు, న్యాయమూర్తులు రాజకీయ తీర్థం పుచ్చుకుంటున్నారు; మరికొందరు రాజకీయ వ్యభిచారులు అధికారపక్ష ప్రాపకం కొరకు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ప్రభుత్వంలో అత్యున్నత హోదాలో పనిచేసే విశ్రాంత తీసుకుంటున్న అధికారులకు సామాజిక బాధ్యత లేదా ! రాజకీయ తీర్థం తీసుకోకుండా ప్రజా సమస్యలపై గళం విప్పి ప్రజలను చైతన్యవంతుల్ని చేయవచ్చు కదా ! ఎర్రబుగ్గ కారుకి బానిసలు అయిన అధికారులు విశ్రాంత సమయంలో కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వంలో చేరి ఎర్రబుగ్గ కారు కోసమే కదా ఈ వెంపర్లాట !
సమయం ఆసన్నమైంది – ఓటు కోసం గుమ్మం ముందుకు వచ్చిన రాజకీయ నాయకులను ప్రజలు తమ సమస్యలపై నిలదీయాలి!
నిలదీయకపోతే తప్పు ప్రజలది అవుతుంది; నాయకులది కానేరదు !!
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు