Former minister scams : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంది. గతేడాది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నేతల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుద్దపుసల్లా కన్పించే మంత్రుల పేర్లు స్కాముల్లో బయట పడుతుండటంతో అంతా అవాక్కవుతున్నారు.
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కొన్ని ఆరోపణలు వెలువడుతున్నాయి. గత పదేళ్ళలో హరీష్ రావు తన మంత్రి పదవీని అడ్డం పెట్టుకొని తన ముఠాతో ప్రాజెక్టుల పేరుతో భూములు, కమిషన్లు, సెటిల్మెంట్ దందాలు సాగించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే హరీష్ రావు ముఠా చేసిన 5వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో స్కాం బయటికొచ్చింది.
హరీష్ రావు దగ్గర గత 20 ఏళ్లుగా పీఏగా పనిచేస్తున్న బూరుగుపల్లి రామచంద్రరావు బీఆర్ఎస్ హయంలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎంతోమంది అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడినట్లు తెలుస్తోంది. హోంగార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారు.
మొన్నటి దాకా బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండటంతో మోసపోయిన బాధితులు ఏం చేయలేకపోయారు. అయితే బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో ధైర్యం చేసిన బాధితులు పోలీస్టేషన్లో మంత్రి పీఫై కేసులు పెడున్నారు. ఉద్యోగాల కోసం తాము చెల్లించిన లక్షల రూపాయల ఇవ్వాలంటూ నిలదీస్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు నీతి సూక్తులు వళ్లించిన హరీష్ రావు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో హరీష్ రావు తన పీఏ విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. బాధితుల పక్షాన ఆయన నిలబడుతారా? లేదా అన్నది పక్కన పెడితే ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ సర్కారును వేడుకుంటున్నారు. మరీ హరీష్ రావుపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి వ్యూహం అవలంభిస్తుందనేది మాత్రం వేచిచూడాల్సిందే..!