Free Travel For Inter Students : ఇంటర్ పరీక్షలకు రాష్ట్రం యావత్తు సిద్ధమైంది. నేటి (ఫిబ్రవరి 28) నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా.. రెండవ సంవత్సరం పరీక్షలు రేపటి (ఫిబ్రవరి 29) నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్ పరీక్షలు రోజుకు ఒకటి మాత్రమే ఉంటుంది. అంటే ఒక రోజు ఫస్ట్ ఇయర్ పేపర్ ఉంటే.. రెండో రోజు సెకండ్ ఇయర్ పేపర్ ఉంటుంది.
ఇప్పటికే విద్యాధికారులు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రతీ విద్యార్థికి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, టాయిలెట్ సౌకర్యం కల్పించారు. దీంతో పాటు తరగతి గదులు ఇరుకుగా ఉంటే విద్యుత్ లైట్లు వేయనున్నారు. ఫ్యాన్స్ కూడా పరీక్ష అయిపోయేంత సేపు నిరాటంకంగా తిరిగేందుకు కొన్ని చోట్ల మరమ్మతులు కూడా చేయించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు, షాపులను పూర్తిగా మూసి వేయాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు.
ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు ఉంటారు. పరీక్ష జరుగుతున్నంత సేపు అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతీ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల సాకుతో హాల్ టికెట్లను ఇవ్వకపోతే కాలేజీకి అనుమతి రద్దు చేస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన అధికారులు. విద్యార్థులు హాల్ టికెట్లు ఆపితే భయపడవద్దని ఇంటర్ బోర్డు సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని దానితో పరీక్ష రాయవచ్చన్నారు.
పరీక్ష ఉన్న రోజున పరీక్ష రాసే విద్యార్థులు గంట ముందు కేంద్రం వద్దకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ కోసం ఆర్టీసీ యాజమాన్యం మార్చి 20వ తేదీ వరకు ఉదయం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. పైగా ప్రతీ ఇంటర్ విద్యార్థి పరీక్షల రోజుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని చెప్పింది. విద్యార్థులను 9 గంటల వరకు కేంద్రంకు చేర్చాలి కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు వేకువ జామునే డ్యూటీ ఎక్కుతారని తెలుస్తోంది. ప్రతీ గ్రామం, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను 8 గంటల వరకే కేంద్రం వద్ద చేర్చేందుకు రూట్లలో ప్రత్యేక బస్సులతో పాటు సమయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.