
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో పలు చర్చలకు తావిస్తున్నది. ఆయన సడెన్ గా ఈ టూర్ కు వెళ్లడంతో ఇప్పుడు చర్చ నడుస్తున్నది. శుక్రవారం రాత్రి ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చంద్రబాబు భేటీ తర్వాత ఢిల్లీలో పరిస్థితులను వైసీపీ అధినేత జగన్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా రాజకీయ అంశాలపైనే ఈ భేటీ జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా పొత్తులపై ఏం తేల్చారనేది ఇప్పుడు ఎవరికీ తెలియని రహస్యం. ఇప్పటి వరకు రెండు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే బీజేపీ ప్రస్తుత దృష్టంతా తెలంగాణపైనే ఉంది. ఇక్కడ గెలిచి సౌతిండియాలో మరోసారి జెండా ఎగురవేయాలని భావిస్తున్నది. అయితే తమకు ఏపీలో సహకరిస్తే తెలంగాణలో ఉన్న తమ క్యాడర్ బీజేపీకి సహకరిస్తుందనే ప్రతిపాదన చంద్రబాబు చేసినట్లుగా సమాచారం. కేసీఆర్ ను ఢీకొట్టేందుకు అర్థికంగా, మీడియా పరంగా కావాల్సిన సహకారం ఇస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే చంద్రబాబుతో సఖ్యత ఉన్నా కూడా తెలంగాణలో కలిసి ప్రయాణం వద్దని తెలంగాణ బీజేపీ నాయకులు కోరుతున్నట్లు సమాచారం. దీంతోనే అమిత్ షా, నడ్డా మరోసారి ఆలోచిద్దామని చంద్రబాబుతో అన్నట్లు తెలుస్తున్నది. ముందుగా తెలంగాణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇవి గట్టేక్కాక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందామని చెప్పినట్లుగా అనుకుంటున్నారు. అయితే వైసీపీతో కూడా తమకు సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా ఇప్పటికిప్పుడు ఏం తేల్చలేమని చెప్పినట్లుగా తెలుస్తున్నది.
అయితే ఏపీలో పరిస్థితులను ఎప్పటికప్పుడూ కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు అమిత్ షాకు చేరవేస్తున్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీల పరిస్థితిపై ఆయనకు ఓ అంచనా ఉంది. అందుకే వారు పూర్తిస్థాయిలో చంద్రబాబుకు ఓ హామీ ఇవ్వకపోవడానికి కారణంగా తెలుస్తున్నది. రానున్న రోజుల్లో ఏ పార్టీతో అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి రెండింటితో సఖ్యతతో ఉండేందుకే ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి మరోసారి భేటీలో ఆలోచిద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఇరు పార్టీల నేతల నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పొత్తు ఇంకా ఖరారు కాలేదనేది స్పష్టమవుతున్నది.






