Gaddar Movies List :
‘గద్దర్’ ఈ పేరు వింటేనే ప్రజల్లో చైతన్యం నింపిన ఒక గొంతుక గుర్తుకు వస్తుంది. ప్రజా సమస్యలను పాటల రూపంలో అందరికీ చేరువ చేసేవాడు గద్దర్. ఇతని అసలు పేరు గుమ్మాడి విఠల్ రావు అని చాలా మందికి తెలియదు. తను చేసిన మెదటి ఆల్బం పేరుతోనే గద్దర్ గా ప్రాచుర్యంలోకి వచ్చాడు. గద్దర్ గతంలో నక్సలైట్ గా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసాడు. రాజకీయ, సినీరంగంలో అడుగుపెట్టి ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. దశాబ్దాల పాటు ప్రజల కోసం పాడిన ఈ గొంతు స్వరం ఇప్పుడు మూగబోయింది. ప్రజా గాయకుడిగా గుర్తింపు పొందిన గద్దర్ ఇక లేరనే విషయం చాలా మందిని బాధ పెట్టే విషయం.
సినిమాల్లో కూడా ప్రజా సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు గద్దర్. తొలిసారిగా 1984 లో ‘రంగుల కల’ అనే చిత్రంలో నటించాడు. ఇందులో యాదగిరి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి’ అనే పాటను తానే స్వయంగా రాసి ఆడి పాడారు. 1971 లో ‘ఆపరా రిక్షా’ పాట చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. తన మొదటి ఆల్బం ‘గద్దర్’ క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆర్ నారాయణ మూర్తి సినిమా ‘ఒరేయ్ రిక్షా’ లో ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ పాట అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ పాట ప్రజల గుండెల్లో సుస్ధిర స్థానంను కలిగి ఉంది. ఈ పాటకు నంది అవార్డు రాగా గద్దర్ దీన్ని తిరస్కరించాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో ఉన్న ‘పొడుస్తున్న పొద్దు మీద’ అనే పాట తెలంగాణ లో మంచి ఊపును తెచ్చింది. ఇది కూడా నంది అవార్డును కైవసం చేసుకుంది.
‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను గద్దర్ రాసి పాడాడు. ఇది తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక కావడం విశేషం. 2016లో విడుదలైన ‘దండకారణ్యం’ చిత్రం, 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ లో గద్దర్ ముఖ్యపాత్రలో నటించారు. చివరగా ‘ఉక్కు సత్యాగ్రాహం’ అనే సినిమాలో కనిపించారు. గద్దర్ రాసిన పాటల్లో ‘పొడుస్తున్న పొద్దుమీద’, ‘బండెనక బండి కట్టి’, ‘మల్లె తీగకు’ పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. పాటలు రాయడమే కాకుండా గద్దర్ చాలా పాటలు పాడి ప్రజల హృదయాలకు దగ్గరయ్యాడు. ప్రతిపాటలోనూ ఉండే సాహిత్యం సామాన్యులకు అందరికీ అర్ధమవుతాయి. అలాగే జనాల్లో సమాజంపై స్పృహ కలిగించేలా ఉంటాయి.