![gaddar](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/04/gaddar-780x470-1.jpg)
Gaddar : ప్రజా పాట మూగబోయింది. మరో వీరుడిని తన అక్కున చేర్చుకుంది. ‘బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి నైజామోడిని గద్దించిన గద్దర్’ ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా..’ అంటూ ఉద్యమాన్ని ఊర్రూతలూగించారు. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు ఆయన ప్రతీ పాట ఒక చురకత్తే.. పీడిత, తాడిత ప్రజల కోసం పరితపించే ఆయన వారి కోసం ముందుండేవారు. ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఆయన గొంతుతో ప్రాణం పోశాడు. ఉద్యమ బిడ్డల పోరాట స్ఫూర్తిని పాట రూపంలో నలు దిశలా చాటేవారు. గద్ధరన్న పాడిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.. ఒక చురకత్తే.. ఇంతటి గొప్ప వీరుడు మనలను విడిచి వెళ్లడం దురదృష్టమనే చెప్పాలి.
గుండె సంబంధిత అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని కూడా చెప్పారు. కానీ గతంలో ఆయనకు ఉన్న లంగ్స్ ఇబ్బందితో మరణించారు. అయితే హాస్పటిల్ లో చేరిన ఆయన తన అభిమానులు, ప్రజలకు జూలై 31న బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం చెప్పారంటే ‘మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తాను. నా బతుకు సుధీర్ఘ పోరాటం. 76 ఏళ్లుగా పాటతో పోరాటాలు చేస్తూనే ఉన్నాను. నా వెన్నుమొకలోని బల్లెట్ వయస్సు 25 సంవత్సరాలు. బట్టి పాదయాత్రలో పాల్గొన్నాను. ప్రస్తుతం గుండెకు సంబంధించిన అనారోగ్యం రావడంతో చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్ లో చేరాను. పరీక్షలు చేయించుకున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాను. మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తాను. మళ్లీ ఉద్యమాల పాటలు అందుకొని ప్రజల రుణం తీర్చుకుంటాను’ అని రాసుకచ్చారు.
ఆపరేషన్ సక్సెస్ అయినా లంగ్స్ కు ఉన్న ఇబ్బందుల కారణంగా ఆయన 6వ తేదీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పాట రుణం తీర్చుకుంటానని చెప్పిన గద్ధర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన అభిమానులు, విప్లవ పోరాట సానుభూతిపరులు, కవులు, రచయితలు, రాజకీయ నాయకు ధు:ఖించారు. ఆయనకు నివాళులర్పించి ఆయన పాటలను గుర్తుకు చేసుకున్నారు. గద్దర్ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉంటారని ప్రతీ ఒక్కరూ చెప్పుకచ్చారు. ఆయన అంతిమ వీడ్కోలు జనంతో సంద్రాన్ని తలపించింది.