Gajanana Fire : వీధి వీధులా, వాడ వాడలా గణపతి కొలువు దీరాడు. చల్లని స్వామిని కొలిచేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మండపాల వద్దకు చేరుకున్నారు. ఉదయం, సాయంత్రం పూజలు, వ్రతాలు, అన్నదానాలు చేస్తూ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా కొలువయ్యాడు స్వామి గణపతి. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు సైతం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.
గణపతి ఇష్టారూపుడు. ఏ భగవంతుడు రూపంలోనైనా ఆయనను కొలవవచ్చు. ఏ రూపంలో కొలిచినా కోర్కెలు తీరుస్తాడు అన్న విశ్వాసం భక్తుల్లో మెండుగా ఉంది. దేవతల రూపంలో కాకుండా సాంఘిక పరమైన నేతలు, ‘మిషన్ల’ రూపంలో కూడా గణపతిని కొలుస్తుంటారు. ఇటీవల ఇస్రో సక్సెస్ చేసిన మూన్ మిషన్ చంద్రయాన్ 3 పై గణపతి అధిరోహించినట్లు తయారు చేసి ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. ఇదే విధంగా ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా గణపతిని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా గణపతులను తయారు చేసి కొలుస్తున్నారు భక్తులు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం దరిమిలా ఏపీలో గణేశ్ మండపం ఏర్పాటు చేశారు. ‘అందులో చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడంతో ఆగ్రహించిన గణనాథుడు దివికి వచ్చి జగన్ ను జైలులో వేస్తాడు’ అన్న అర్థం వచ్చేలా ఏర్పాటు చేశారు.’ జైలు గదిలో జగన్ ను ఉంచి బయట గణపతి మూషికం కనిపిస్తారు. ఇప్పుడు ఏపీలో ఈ మండపం ఫొటోలు వైరల్ గా మారాయి.