
Gajaraju Arrogance : తిరుమల శ్రీవారి ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సెలవు దినాలలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే తాజాగా తిరుపతి లో ఓ అరుదైన ఘటన జరిగింది. గజరాజుల అప్రమత్తతతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పెనుప్రమాదం తప్పింది.
ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ గురువారం రాత్రి వాహనసేవలో పాల్గొనేందుకు రెండు గజరాజులు (లక్ష్మి, వైష్ణవి) వచ్చాయి. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తూ కొందరు.. తిరిగొస్తూ మరికొందరు.. విశ్రాంతి తీసుకుంటూ ఇంకొందరు.. దుకాణాల వద్ద పలువురు నిల్చుని ఉన్నారు. అంతా సందడిగా ఉంది. మధ్యాహ్నం 4.40 నుంచి 4.50 గంటల మధ్య చిన్నపాటి చిరుజల్లులతో పెనుగాలులు వీచాయి. దీంతో మహా ద్వారానికి ఎదురుగా ఉన్న వందల ఏళ్ల నాటి రావిచెట్లు కిందకు భక్తులు చేరుకున్నారు. వర్షం తీవ్రంగా ఉంది.
అంతలోనే ఒక్కసారిగా అలజడి మొదలైంది వైష్ణవి అనే గజరాజు ఘీంకారం చేసింది చెట్టు కింద ఉన్న భక్తులు భయపడి పరుగులు తీశారు. ఒక్కసారి గా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరిగిందోనని తేరుకుని చూసేలోగా అకస్మాత్తుగా రావిచెట్టు మొదలు రెండు ముక్కలుగా చీలి నేలకొరిగింది. గజరాజు అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అంతా అనుకున్నారు. ఈ గజరాజులకు ప్రత్యేకత ఉంది. దేవుడికి నిర్వహించే వివిధ పూజాది కార్యక్రమాలలో ఇవి పాల్గొంటాయి. అయితే గజరాజు తమ ప్రాణాలు కాపాడిందని భక్తులంతా చర్చించుకుంటున్నారు. వాటికి మొక్కారు. కొందరు ఫొటోలు దిగారు.






