26.2 C
India
Friday, July 19, 2024
More

  KCR and Jagan : ఇంటికి పోతాం, రెస్టు తీసుకుంటాం !

  Date:

  • నాడు కేసీఆర్ ; నేడు జగన్ మోహన్ రెడ్డి
  KCR and Jagan
  KCR and Jagan

  “పెద్దన్న – చిన్నన్న” గా చెప్పబడే తెలంగాణా కేసీఆర్, ఆంధ్రా జగన్ ఎన్నికల ముంగిట ఒకే మాట కూడబలుకున్నట్లు చెప్పారు. తెలంగాణా ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ “ఏముంది ఓడిపోతే ఇంటికి పోతాం హాయిగా రెస్టు తీసుకుంటాం” అన్నారు. ఆయన ఆ మాట ఏ ముహూర్తాన అన్నారోగానీ తథాస్తు దేవతలు “తథాస్తు” అని ఆశీర్వదించారు.

  ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వంతొచ్చింది. ఓ వైపు “టీడీపీ – జనసేన” పొత్తు ; మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఊరూరా తిరుగుతూ కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ ఎలా జగన్ మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసిందీ దండోరా వేస్తోంది. ఇంకోవైపు సొంత చెల్లెలు షర్మిల మణిపూర్ క్రిస్టియన్ల పై జరుగుతున్న దాడులను ఎత్తిచూపుతూ “నువ్వు క్రిస్టియన్ వేనా ?” అని నిలదీస్తోంది. వేరొక వైపు అంగన్వాడీలు – టీచర్లు – డాక్టర్లు – మున్సిపల్ ఉద్యోగులు – లాయర్లు – అగ్రిగోల్డ్ బాధితులు – పూజారులు – ఉద్యోగులు – రైతులు – దర్జీలు – క్షురకులు ఒకరనేమిటి 36 వృత్తులు వారు ఉవ్వెత్తున నిరసనలు చేపట్టారు. సందట్లో సడేమియగా ఒకరోజున తనతో 5 నిమిషాలు మాట్లాడటానికి సంవత్సరాలు తరబడి పడిగాపులు కాచినవారు ఇప్పుడు తాను కబురెట్టినా ముఖం చూపించని పరిస్థితి. ఇప్పటి వరకూ నోటా ఓట్లు కూడా సాధించలేదని స్థితిలో ఉన్న కమ్యూనిస్టులు ఎర్రజెండాలు చేబూని కవాతు చేస్తున్నారు. ముందుండి కార్మికులను నడిపిస్తున్నారు. తనకు వెన్నుదన్నుగా ఇంతకాలం నిలిచిన పెద్దన్న కేసీఆర్, పదవి పోయి – కీలు జారి – సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నారు.

  “తన సంక్షేమ పథకాలు, తన వాలంటీరు వ్యవస్థ, తన ఫేస్ వాల్యూ చూసి ఓటేస్తారు గాని ఈ ఎమ్మెల్యేలు – మినిస్టర్లు – ఎంపీలు పిపీలకాలు” అనుకున్న జగన్ మోహన్ రెడ్డికి తొలిసారిగా ఓటమి భయం పట్టుకుంది – అని ఎవరైనా అంటే పొరబడినట్టే ! “టీడీపీ – జనసేన కలిసి కాదు, ఒంటరిగా పోటీ చేయండి ” అని ఏనాడు అన్నాడో ఆనాడే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ని, షర్మిలను పట్టించుకోకుండా వదిలేయాల్సిన సమయంలో వారి పెళ్లిళ్ల గురించి పదేపదే మాట్లాడి వారిని పెంచారు. తెలంగాణలోనూ కేసీఆర్ ఇదే పొరపాటు చేశారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ని విమర్శించి వారిని పెంచారు. అలాగే పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి ట్వీట్లు వెగటు పుట్టించాయి. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి అభాసుపాలయ్యారు.

  వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి బడుగులకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడెక్కడి డబ్బూ తెచ్చి వారి కోసం ధారపోశారు. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన మొదటి రోజు నుంచి 2024 ఎన్నికల తేదీని దృష్టిలో పెట్టుకుని పనిచేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, రోజా, అంబటి, విజయసాయిరెడ్డి తదితరులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల కన్నా ఈ వాచాలతే ప్రజలలోకి బలంగా, వేగంగా వెళ్లాయి. చంద్రబాబు అరెస్టు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పార్థసారధి వంటి యాదవ నాయకుడ్ని, విజ్ఞాన్ రాయలు వంటి సచ్ఛరితుడ్ని ఎందుకు దూరాన పెట్టారో ఆయనకే తెలియాలి. ఆఖరి నిమిషంలో అభ్యర్ధుల మార్పు నాయకులలోనే కాదు కార్యకర్తలనూ కన్ ప్యూజన్ లోకి నెట్టింది. ఇదే సమయంలో కోడికత్తి కేసు, వివేకా హత్యకేసు వేటాడుతున్నాయి.

  ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఫోటో చూసి ఓటేస్తారు అని నమ్మిన, నమ్మబలికిన జగన్ మోహన్ రెడ్డి మాటలలో తడబాటు కనిపిస్తోంది. ముఖంలో ఆ జీవకళ లోపిస్తోంది. ఇంతకాలం, అడిగినప్పుడల్లా అప్పులిచ్చిన కేంద్రం చాపక్రింద నీళ్లలా తాను ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసిందీ చెప్పుకుంటోంది. ఈ సంధికాలంలో వ్యూహా ప్రతివ్యూహాలు రచించాల్సిన జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్నారు. తన పార్టీలో అసమ్మతి రాగాలు ఆలపిస్తున్నవారు రోడ్డెక్కి నిరసనలు ఆరంభిస్తే జగన్ మోహన్ రెడ్డికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

  ఒకనాడు టీడీపీ నాయకుడు ప్రసంగవశాత్తు “బోషడ్డీ” అన్నందుకు విదేశాలలో తలదాచుకున్నారు. టీడీపీ అగ్రనాయకత్వం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికి సాహసించలేకపోయింది. ఈరోజున ఎందరో ఎందరెందరో రోడ్డెక్కుతున్నారు. ఆ బెట్టు సడలింది.

  షర్మిల వెనుక కేవీపీ ఉన్నారు, ఆయన రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్న కరుడుగట్టిన ఫ్యామ్లీ ఫ్రెండ్! మరి ఆయన షర్మిలతో జగన్ ను ఓడిస్తారా? లేక గెలిపించే ప్లాన్ చేశారా? షర్మిల దారెటు అన్నది ఆసక్తిగా మారింది.  షర్మిల ఎంట్రీ చివరకు జగన్ మోహన్ రెడ్డికి లాభిస్తుందా ? అలా రాజకీయాన్ని కేవీపీ మలుపు తిప్పుతారా !

  – తోటకూర రఘు,
  ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

  AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

  Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

  Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

  IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

  IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

  YCP : వైసీపీ దేనికి సిద్ధం 

  YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున...