China Gold : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారం నిల్వను కనుగొంది. ఈ విస్తారమైన బంగారు గని అంచనా విలువ వందల బిలియన్ల రూపాయలు అని నమ్ముతారు. ఇది చైనీస్ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లా పనిచేస్తుందని అంటున్నారు. ఈ బంగారు ఖని బయటపడడంతో చైనా ఖనిజ సంపద విస్తరణ ఓ రేంజ్ లో ఉంటుందని.., ప్రపంచవ్యాప్తంగా చైనాను బలోపేతం చేయగల సంభావ్య ఆర్థిక వ్యూహాంగా కనిపిస్తోందని అంటున్నారు..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్జియాంగ్ కౌంటీలోని వాంగు బంగారు గనిలో భారీ బంగారం ఉన్నట్టు గుర్తించారు. భూమి నుండి 2,000 మీటర్ల కంటే తక్కువ లోతులో ఉన్న ఈ గనిలో 40 కంటే ఎక్కువ బంగారు సిరలు కనుగొనబడ్డాయి.
హునాన్ ప్రావిన్షియల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గని యొక్క ప్రధాన ప్రాంతంలో మొత్తం బంగారు నిల్వలు ఇప్పుడు 300.2 టన్నులు ఉన్నట్టు అంచనా.. కొత్తగా కనుగొన్న నిల్వల్లో 1,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ఈ నిల్వల మొత్తం అంచనా విలువ దాదాపు 600 బిలియన్ యువాన్లు (దాదాపు రూ. 7 లక్షల కోట్లు)గా చెబుతున్నారు..
హునాన్ ప్రావిన్షియల్ జియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ లియు యోంగ్‌జున్ ఈ ఆవిష్కరణను చైనా ఖనిజ అన్వేషణ వ్యూహానికి పెద్ద విజయంగా అభివర్ణించారు. వాంగు గని ఇప్పటికే చైనాలోని అత్యంత ముఖ్యమైన బంగారు మైనింగ్ కేంద్రాలలో ఒకటి. 2020 నుండి ప్రావిన్షియల్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఖనిజ అన్వేషణలో 100 మిలియన్ యువాన్లు (సుమారు రూ. 115 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు భారీ బంగారు గని బయటపడడంతో అందరూ సంతోషిస్తున్నారు.