Annavaram : కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వర్ణ తాపడంతో చేసిన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. అనివెట్టి మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడంతో తయారు చేసిన కవచాన్ని అమర్చారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో రూ.2 కోట్లు ఖర్చుతో ఈ ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకువచ్చిన నారేప కర్రతో 60 అడుగుల ధ్వజస్తంభాన్ని తయారు చేశారు. దానికి సుమారు 300 కిలోల రాగి వినియోగంతో పాటు దానిపై 1,800 గ్రాముల బంగారు తాపడం చేశారు. స్తంభానికి అమర్చిన స్వర్ణ రేకపై అష్ట లక్ష్ములు, దశావతారాలు, పంచాయతనాలు తీర్చిదిద్ది ప్రతిష్ఠించారు. వైదిక బృందం ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను ధ్వజస్తంభ ప్రదక్షిణకు అనుమతించారు.