అలాగే వలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వలంటీర్ల కాలపరిమితి 2023 ఆగస్టుతో ముగిసిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించగా.. ఏడాది క్రితమే జగన్ వాలంటీర్లను తొలగించారని మంత్రులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఇప్పటి వరకు 1.07లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని..ప్రస్తుతం 1.10లక్షల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని సీఎం చంద్రబాబుకు మంత్రులు తెలిపారు. 2023లోనే వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదన్నారు. దీంతో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అంతే కాకుండా డైలీ పేపర్ కొనుగోలుకు ప్రతి నెలా ఇస్తోన్న 200రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాక్షి పత్రిక కొనుగోలుకే వైసీపీ హయాంలో దినపత్రికల చందా ప్రవేశపెట్టారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. రెండేళ్ళలో దినపత్రిక చందా కోసం 200కోట్లకు పైగా ఖర్చు చేశారని.. దీంతో ఈ విషయంపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆదేశించింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద సహాయ ప్యాకేజీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.